ఎంత అన్యాయం ‘బాబూ’
టీడీపీ రాజంపేట అభ్యర్థిగా మేడా... రైల్వేకోడూరుకు వెంకటసుబ్బయ్య నమ్ముకున్నవారికి హ్యాండిచ్చిన చంద్రబాబు
రాయచోటి, ప్రొద్దుటూరుకు ఖరారుకాని ‘దేశం’ అభ్యర్థులు టీడీపీ జిల్లా అధ్యక్షుడి టిక్కెట్టుపై తేల్చని చంద్రబాబు ‘వరద’కు ఇప్పించేందుకు సీఎం రమేశ్ ప్రయత్నాలు బాబు తీరుపై మథనపడుతున్న నేతలు
టీడీపీ అసెంబ్లీ బరిలోని అభ్యర్థుల జాబితాను మూడు విడతలుగా విడుదల చేసినా 10స్థానాలకు ఖరారు కాలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేరు ఖరారు కాలేదు. ఇతనికి టిక్కెట్టు దక్కకుండా ఇటీవలే ‘పచ్చకండువా’ వేసుకున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఇప్పించేందుకు ఎంపీ సీఎం రమేశ్ ప్రయత్నిస్తున్నారు. రమేశ్ మాయలో పడిన చంద్రబాబు కూడా పార్టీని నమ్ముకున్న లింగారెడ్డిని కాదని ‘వరద’వైపు చూస్తున్నారు.
‘‘లింగారెడ్డిని ‘మ్యానేజ్’ చేసుకో టిక్కెట్టు నీకే’’ అని ‘వరద’తో చెప్పినట్లు తెలిసింది. లింగారెడ్డి, వరద మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. అచ్చం ఇదే పంచాయతీ రాయచోటిలోనూ జరుగుతోంది. ప్రతిపక్షంలోనూ పార్టీని కాపాడుతూ వచ్చిన పాలకొండ్రాయుడును కాదని ఇటీవల ‘సైకిల్’ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే రమేశ్‌రెడ్డికి టిక్కెట్టు దాదాపు ఖాయమైనట్లు తెలిసింది. రమేశ్ సోదరుడు వాసుకు కడప ఎంపీ టిక్కెట్టు ఇచ్చి, తిరిగి రమేశ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలనే నిర్ణయంపై పాలకొండ్రాయుడు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకున్న తనకు కాకుండా స్వార్థం కోసం పార్టీలోకి చేరిన రమేశ్‌రెడ్డి కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వడంపై అనుచరుల వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీని నమ్మున్న నాయకులకే బాబు న్యాయం చేయలేకపోతే, సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
డబ్బుంటునే ‘పచ్చ’ టిక్కెట్టు:
మూడో విడత జాబితాలో రాజంపేట, రైల్వేకోడూరు అభ్యర్థులుగా మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎస్, వెంకటసుబ్బయ్య పేర్లను బాబు ప్రకటించారు. ప్రభుత్వ లెక్చరర్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన అజయ్‌బాబు రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు. అయితే అజయ్‌బాబు ఆర్థికంగా బలంగా లేరనే కారణంతో ‘డబ్బే’ ప్రామాణికంగా డాక్టర్ వెంకటసుబ్బయ్య(అనస్తీషియా)పేరును ప్రకటించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ఈయన పేరు కూడా చాలామందికి తెలీదని ఇలాంటి వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారని అజయ్‌బాబుతో పాటు ఆయన భార్య సునంద మండిపడినట్లు తెలిసింది. పార్టీని నమ్ముని వస్తే ‘బాబు’ మంచిన్యాయం చేశారని...ఇలాంటి పార్టీలో ఉండాల్సిన పనిలేదని తన భర్తకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన సునంద మాటలు చూస్తుంటే వారు టీడీపీని వీడే పరిస్థితి ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాజంపేటలో కూడా మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్యకు ఎన్నికల వ్యయాన్ని భ రించే సత్తా లేదని, మేడా మల్లిఖార్జునరెడ్డి అయితే డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడతారని సీఎం రమేశ్ చెప్పిన మాటల వల్లే ఇక్కడ కూడా ‘మేడా’కు టిక్కెట్టు దక్కింది. దీంతో బ్రహ్మయ్య బోరుమంటున్నారు.
తమ్ముళ్ల వైరం...జగన్ సైన్యానికి అదనపు లాభం:
ఎలాంటి అసంతృప్తులు, విభేదాలు లేకుండా ఆందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చాలాచోట్ల టీడీపీలోని అసమ్మతిపోరు వైఎస్సార్సీపీకి లాభించనుంది. కమలాపురంలో ఇన్నాళ్లూ ఉప్పు,నిప్పుగా ఉన్న పుత్తా, వీరాశివా వర్గాలు ఇంకా కుదురుకోలేదు. ‘నువ్వు చెప్పినా పుత్తాకు చేసేది లేదు. నష్టపోయింది మేం. నువ్వుకాదు. అని వీరాశివా అనుచరులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.’ దీంతో వీరశివా రాక పుత్తాకు మేలు కంటే కీడే కలుగజేసేలా ఉంది. ఇది వైఎస్సార్సీపీ అభ్యర్థి రవీంద్రనాథరెడ్డికి లాభించనుంది. రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేటలో కూడా అజయ్‌బాబు, పాలకొండ్రాయుడు, బ్రహ్మయ్యలుకూడా తమను కాదని టిక్కెట్లను దక్కించుకున్నవారికి మద్ధతిచ్చే సూచనలు కన్పించడం లేదు. ఈ పరిణామం కూడా కొరముట్ల, ఆకేపాటి, గడికోటలకు మేలు చేయనుంది. ప్రొద్దుటూరులో మాత్రం లింగారెడ్డికి టిక్కెట్టు ఇస్తే...వరద, ‘వరద’కు ఇస్తే లింగారెడ్డి మద్దతు ఇచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో ఇక్కడా వైఎస్సార్సీపీకి మరింత మేలు చేకూరనుంది. డీఎల్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న ‘పుట్టాసుధాకర్‌యాదవ్’ డీఎల్ యూటర్న్‌తో కుదేలైపోయాడు. ఇక్కడ రఘురామిరెడ్డి ఎలాంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోనున్నారు.