పరిహారం చెల్లింపులో జాప్యం వద్దు
♦ మిడ్ మానేరు కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి
♦ ఆర్అండ్ఆర్పై సమీక్షలో కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టులో 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయనున్నామని, ఈ దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, సహాయ, పునరావాస (ఆర్అండ్ఆర్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయరాదని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. మిడ్‌మానేరు. కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు ప్యాకేజీ–8 లో పెండింగ్‌లో ఉన్న 200 ఎకరాల భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాల్వలను స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అన్నారు. మిడ్ మానేరు కింద 80 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, కాలువలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయకుంటే లక్ష్యం నెరవేరదని మంత్రి అభిప్రాయపడ్డారు. మిడ్ మానేరు ముంపు బాధితుల ఆర్అండ్ఆర్ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కాగా, మిడ్ మానేరు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడి ముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసి తులకు ఇంకా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లే వారికి రూ.2 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని కోరారు.
ఆర్అండ్ఆర్ కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలలో విద్యుత్ లైన్లు తొలగించాలని చెప్పారు. అలాగే కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను కూడా వేగిరం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్, ఈఎన్సీ మురళీధరరావు పాల్గొన్నారు.