‘సీట్ల’పై అసంతృప్తి లేదు: మాంఝీ
160 సీట్లలో పోటీకి బీజేపీ యోచన!
న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి బీజేపీ కేటాయించిన సీట్ల సంఖ్యపై తనకు అసంతృప్తి లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఆదివారం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి సుమారు 15 సీట్లు ఇస్తామని బీజేపీ శనివారం ప్రతిపాదించింది. అలాగే.. మాంఝీకి మద్దతుగా ఉన్న ఐదుగురు ప్రస్తుత శాసనసభ్యులు బీజేపీ టికెట్లపై పోటీ చేయాలని సూచించింది.
ఈ ప్రతిపాదనపై మాంఝీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీజేపీ నేతల బృందం శనివారం సమావేశమై చర్చించింది. ఆదివారం ఢిల్లీలో మాంఝీని కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ధర్మేంద్రప్రధాన్ తదితరులు కలిసి మాట్లాడారు. 20 సీట్లు తీసుకోవడానికి మాంఝీ ఒప్పుకున్నట్లు తెలిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 160 సీట్లలో తాను పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది.
పోలీసుల అదుపులో మాంఝీ తనయుడు
జితిన్‌రామ్ మాంఝీ కుమారుడు ప్రవీణ్‌కుమార్ తన కారులో రూ. 4.65 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. గయ -జెహానాబాద్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. పట్నా నుంచి గయకు వెళుతున్న ప్రవీణ్ కారును తనిఖీ చేశారని.. ఆయన తన వద్ద ఉన్న నగదుకు సంబంధించిన సరైన వివరాలు చెప్పకపోవటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వివరించారు.
అయితే.. తాను పట్నాలో నిర్మిస్తున్న తన ఇంటి కోసం ఈ డబ్బును తన సోదరుల వద్ద నుంచి తీసుకెళుతున్నట్లు ప్రవీణ్ విలేకరులతో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 19 నుంచి బిహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను ఏడాది పొడుగునా నిర్వహిస్తున్న కాంగ్రెస్.. అందులో భాగంగా 19వ తేదీన ‘సమత - సామరస్యత’ పేరుతో పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్‌నగర్‌లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తోంది. మహాత్మా గాంధీ 1917లో ఇక్కడి నుంచే నీలిమందు రైతుల కోసం తొలి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.
మజ్లిస్ పోటీ బీజేపీకి లాభం: కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న మజ్లిస్ పార్టీ నిర్ణయం బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతుంది కానీ మజ్లిస్ పార్టీకి కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.