జై జవాన్ తండా
మాతృభూమి సేవలో మాన్సింగ తండా యువతేజాలు
{పస్తుతం సైన్యంలో 10 మంది శిక్షణ పొందుతున్న మరో 15 మంది
‘జవాన్ తండా’గా పేరు మార్చాలని స్థానికుల ప్రతిపాదన
నర్మెట : మాతృభూమి సేవలో తరించేందుకు వారంతా సొంతూరిని, కుటుంబ సభ్యులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లారు. దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడటమే తమ అదృష్టంగా భావించి సైన్యంలో చేరిన ఆ యువజనులు ఆదర్శప్రాయులు. అటువంటి యువతేజాలకు నెలవుగా మారింది నర్మెట మండలంలోని మాన్సింగ్ తండా. దేశ సేవకు యువ కెరటాలను అందిస్తున్న ఆ ఆదర్శ పల్లె అంకుషాపూర్, బొత్తలపర్రె గ్రామపంచాయతీల పరిధిలో ఉంది. తండాకు చెందిన దాదాపు 10 మంది యువకులు అస్సాం, జమ్మూకాశ్మీర్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాల్లో భారత సైన్యం ద్వారా సేవలందిస్తున్నారు. మరో 15 మంది శిక్షణపొందుతూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించేందుకు సన్నద్ధమవుతుండటం గమనార్హం.
ఒకరిని చూసి ఇంకొకరు..
నర్మెట మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని మాన్సింగ్ తండాను చాలామంది ‘జవాన్’ తండా అని కూడా పిలుస్తుంటారు. తమ ఊరి పేరును ‘జవాన్’తండాగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మారుమూల తండా నుంచి గత 10 సంవత్సరాల కాలంలో 10 మంది సైన్యంలో చేరడం విశేషం. వీరంతా ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొంది సైన్యంలో చేరడం గమనార్హం. తండాలో మొత్తం 96 కుటుంబాలు నివాసముంటున్నారుు. ఇక్కడి జనాభా 416. వీరిలో 296 మంది గిరిజనులు. మొత్తం 100 మంది యువకులు ఉండగా, వారంతా విద్యావంతులే కావడం గమనార్హం. స్థానిక యువత ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తి, సైన్యంలో చేరడంపై ప్రధానంగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరు తమకున్న భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు.
కనీస సౌకర్యాలకూ నోచుకోక..
దేశానికి యువ కెరటాలను అందిస్తున్న ఈ తండా అభివృద్ధిలో అట్టడుగున ఉంది. రోడ్లు, నీటి వసతి వంటి కనీస సౌకర్యాలు కూడా అక్కడ కనిపించవు.
తండా
వాసులు స్థానిక సమస్యలతో నిత్యం సతమతమవుతున్నారు. వారి గురించి పట్టించుకునే తీరిక ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ లేదు. ప్రగతి రథానికి చక్రాలుగా భావించే మాన్సింగ్ తండా వంటి పల్లెలు వెనుకంజలో ఉంటే గాంధీ కలల గ్రామ స్వరాజ్యం సాకారమయ్యేదెలా? అని తండాకు చెందిన విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.
దేశానికి సేవ చేసేందుకే..
దేశం కోసం, మా తండా కోసం ఏదో ఒకటి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకునే వాణ్ని. ఒకసారి బీఎస్ఎఫ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని దినపత్రికల్లో చూసి దరఖాస్తు చేశాను. పరీక్షకు ప్రిపేరవడంతో పాటు వ్యాయూమం, ఈవెంట్స్పై దృష్టిసారించడంతో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం పంజాబ్ బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నా. తండా అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. - లకావత్ సురేష్, బీఎస్ఎఫ్ సైనికుడు, పంజాబ్
నా చిన్నప్పటి కోరిక నెరవేరింది
నేను చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని కోరిక. మా తండా స్కూల్లోనే పదోతరగతి దాకా చదివాను. ఆ తర్వాత ఆర్మీ నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే దరఖాస్తు చేసి, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేశాను. దీంతో సైన్యానికి ఎంపికయ్యూను. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో పని చేస్తున్నాను. - లకావత్ రాజు, సైనికుడు, కాశ్మీర్