ఉన్నోళ్లకు ఒక న్యాయం.. లేనోళ్లకు ఒక న్యాయమా?
మేయర్‌ను నిలదీసిన మన్సూర్‌నగర్ వాసులు
నెల్లూరు, సిటీ:
ఉన్నోళ్లకు ఒకన్యాయం.. లేనేళ్లకు ఒక న్యాయమా అంటూ మన్సూర్‌నగర్ వాసులు మేయర్ అజీజ్‌ను నిలదీశారు. నగరంలోని మన్సూనగర్ ప్రాంతంలో బుధవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు కాలువపై ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అధికారులు తిరిగి వెళ్లారు. గురువారం ఉదయం మేయర్ అజీజ్ ఆ ప్రాంత ప్రజలకు ఆక్రమణలు విషయంపై సర్దిచెప్పేందుకు వెళ్లారు. దీంతో ఆ ప్రాంత వాసులు భారీగా చేరుకుని మేయర్‌ను నిలదీశారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమ ఇళ్లు కూలుస్తారా అంటూ ఆందోళనకు దిగారు. నగరంలో భారీ కాంప్లెక్స్‌లు, షాపులు కాలువల పై నిర్మాణం మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ ఇళ్లు కూల్చే ముందు బడాబాబులు భవనాలు కూల్చిన తరువాతే జరగాలన్నారు.
ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్లు కూలిస్తే సహించం
మా ఇళ్లు కాలువకు ఆనుకుని ఉన్నప్పటికీ పట్టా కాగితాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లు కూలిస్తే సహించేది లేదన్నారు. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.