రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు
మీ సేవ కేంద్రాల ద్వారా జారీ
దరఖాస్తు చేసిన 45 రోజుల్లో మంజూరు
మాన్యువల్ పుస్తకాల జారీ తాత్కాలికంగా నిలిపివేత
నక్కపల్లి : రైతులకు మాన్యువల్ విధానంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకనుంచి మీ సేవ కేంద్రాల ద్వారా డిజిటల్ పాస్ పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించింది.పోస్టులో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు జారీ చేస్తున్న మాన్యువల్ పాస్ పుస్తకాల జారీని తాత్కాలికంగా నిలిపి వేసినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇకనుంచి రైతులకు జారీ చేసే నమూనా డిజిటల్ పాస్ పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు పంపించింది.
అక్రమాల నిరోధానికే...
రైతులకు ఇంతవరకు ప్రభుత్వం మాన్యువల్ విధానంలో తహశీల్దార్ సంతకంతో పట్టాదారు పాసుపుస్తకం, ఆర్డీవో సంతకంతో టైటిల్డీడ్లను జారీ చేసేవారు. ఈ విధానంలో నకిలీ పుస్తకాలు తయారు చేయడం, అక్రమాలు జరగడం, రెవెన్యూ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి ఇష్టానుసారం నమోదు చేయడం, ఫొటోలు మార్చేయడం, కొట్టివేతలు, దిద్దుబాట్లు, సంతకాల ఫోర్జరీ లాంటివి జరిగేవి.
పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ సిబ్బంది వేలాది రూపాయలు గుంజుతున్నారని, మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే డిజిటల్ పాస్ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాస్ పుస్తకాలు కావలసిన రైతులు వీఆర్వోల చుట్టూ, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
45 రోజుల్లో జారీ
పాస్ పుస్తకం కోరే ఆస్తి రిజిస్టర్డ్ పత్రాలు, ఫొటోలు మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సమర్పించాలి. రైతులు సమర్పించిన ధ్రువపత్రాలను మీసేవ కేంద్రం నిర్వాహకులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. వాటిని తహశీల్దార్ కార్యాలయంలో డౌన్లోడ్ చేసుకుని చెక్‌లిస్టు పరిశీలించి రైతు సమర్పించిన ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పాస్‌పుస్తకం జారీకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పాస్ పుస్తకం జారీ చేస్తున్నట్లు తహశీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేసి తిరిగి అప్లోడ్ చేస్తారు. దీన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు పరిశీలించి డిజిటల్ పాస్ పుస్తకం తయారుచేసి పోస్టుద్వారా రైతులకు పంపిణీ చేస్తారు.
టైటిల్డీడ్లది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం ఇదే విధానం కొనసాగుతోంది. పాస్ పుస్తకంలో రైతుల భూముల తాలూకు సర్వే నం బర్లు విస్తీర్ణం, మార్కెట్ విలువ, రైతుల డిజిటల్ ఫొటో, రైతు, తహశీల్దార్, ఆర్డీవో ల డిజిటల్ సంతకాలు నమోదై ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో జారీ చేస్తామని తహశీల్దార్ జగన్నాథరావు తెలిపారు. మార్పులు, చేర్పులు, క్రయవిక్రయాల లావాదేవీలు కూడా ఇకనుంచి మీసేవ కేంద్రాల ద్వారానే జరగాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. గురువారం మండల కార్యాలయానికి వచ్చిన నమూనా డిజిటల్ పాస్ పుస్తకాలను ఆయన చూపించారు.