ఆలయ ఉత్సవంలో అపశ్రుతి
మారియమ్మన్ ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బాణసంచాకు మంటలు వ్యాపించి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లిమలైలో సోమవారం వేకువ జామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు.
సేలం:నామక్కల్ జిల్లా కొల్లిమలైలోని ఉరప్పురం గ్రామం లో మారియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వేకువ జామున అమ్మవారికి కత్తిని సమర్పించే ఘట్టం జరిగింది. ఇందుకుగాను కత్తిని ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. రాత్రి జరిగే వేడుక కోసం ముందుగానే బాణ సంచాలు ఓ గదిలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు. ఊరేగింపులో భాగంగా పేలిన ఓ బాణ సంచా నేరుగా ఆ గదిలో పడింది. దీంతో ఆ గదిలో ఉన్న బాణసంచా మొత్తానికి మంటలు అంటుకున్నాయి. ఆ పేలుళ్ల దాటికి ఆ పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
ఆ గదికి పక్కనే ఉన్న వాళ్లు పరుగులు తీశారు. సుమారు అరగంట పాటుగా బాణ సంచాలు పేలడంతో ఆ గది నేల మట్టమైంది. ఆ పరిసరాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మంటలు అదుపు చేయడంతో ఆ పరిసరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ బాణ సంచాలు పేలడం, ఆ గది నేలమట్టం కావడంతో ఆ శిథిలాల కింద ఇద్దరు మృతి చెంది ఉండడం వెలుగు చూసింది. తీవ్రంగా గాయపడి శిథిలాల కిందపడి ఉన్న మరో నలుగురిని ఆగమేఘాలపై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న నామక్కల్ జిల్లా కలెక్టర్ దక్షిణామూర్తి నేతృత్వంలో అధికారుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు గల కారణాలను విచారించారు. మృతి చెందిన వారిలో అదే గ్రామానికి చెందిన కదిర్ వేల్(6), చిన్న స్వామి(40)గా గుర్తించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ మార్చురీకి తరలించిన వాలవందినాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.