వారంలోనే విభేదాలు...
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటై వారం రోజులు గడచాయో లేదో అప్పుడే భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే.. రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా జరగటానికి కారణం పాకిస్తాన్, హురియత్ కాన్ఫరెన్స్, ఉగ్రవాద సంస్థల ఘనతేనన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తొలి వివాదానికి తెరతీయడం తెలిసిందే. అది చల్లారిందనుకునే లోగానే.. అతివాద వేర్పాటువాద నేత మస్రత్ ఆలంను.. సయీద్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయటం.. సంకీర్ణ భాగస్వాముల మధ్య తాజాగా చిచ్చు రాజేసింది. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించింది. అయితే.. ఆలం విడుదల నిర్ణయం సంకీర్ణ పక్షాల సీఎంపీకి అనుగుణంగా తీసుకున్నదేనని పీడీపీ సమర్థించుకుంది. 2010లో రాష్ట్రంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలంను రాష్ట్ర ప్రభుత్వం శనివారం జైలు నుంచి విడుదల చేయడం తెలిసిందే.
దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర బీజేపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం జమ్మూలో సమావేశమై చర్చించారు. ‘సయీద్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. మా పార్టీకి చాలా బాధ కలిగింది. దీనిపై ముందుగా సమాచారం లేదు. సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీని విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇది మా నిర్ణయం కాదు. దీనికి మేం మా అంగీకారం తెలిపేది లేదు. మేం అంగీకరించిన కనీస ఉమ్మడి కార్యాచరణ(సీఎంపీ)కి అనుగుణంగా లేని ఎలాంటి ప్రకటననూ, ఎలాంటి చర్యనూ సహించేది లేదు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరాావృతం కాకుండా ఉండేలా మా అసంతృప్తిని భాగస్వామ్యపక్షానికి తెలియజేయాలని నిర్ణయించాం’ అని బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ జుగల్కిశోర్శర్మ మీడియాతో పేర్కొన్నారు. ‘ఇటువంటి వారిని వదిలిపెట్టి ఉండాల్సింది కాదు. వారు భారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్ముతారు. వేర్పాటు నినాదాలకే దిగుతారు’ అని అన్నారు.
ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు: ఆలం
ఇదిలావుంటే.. నాలుగున్నరేళ్ల జైలు నిర్బంధం నుంచి తాను విడుదల కావటం న్యాయ ప్రక్రియలో భాగంగానే జరిగిందని.. ఈ విషయంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం తనకు ఒనగూర్చిన మేలు ఏదీ లేదని.. ముస్లిం లీగ్ నేత మస్రత్ ఆలం పీటీఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. తాను గత 20 ఏళ్లుగా జైలుకు వెళ్లి వస్తూ ఉన్నానని.. ఇప్పుడు అందులో కొత్త విషయమేముందని ప్రశ్నించారు. ఆయనను విడుదల చేయటం వేర్పాటువాద నేతలకు ప్రభుత్వానికి మధ్య చర్చలను పునఃప్రారంభించటానికి సంకేతమా? అని ప్రశ్నించగా.. ‘‘మేం (ముస్లిం లీగ్) హురియత్ కాన్ఫరెన్స్ వేదికలో భాగంగా ఉన్నాం. ఆ వేదిక తీసుకునే నిర్ణయాన్ని నేను అనుసరిస్తాను’ అని బదులిచ్చారు. మరోవైపు.. ఆలం విడుదలకు నిరసనగా జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ఆది, సోమవారాలు రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.
సీఎంపీకి అనుగుణంగానే నిర్ణయం: పీడీపీ
ఆలంను విడుదల చేయాలన్న నిర్ణయం పీడీపీ-బీజేపీల కనీస ఉమ్మడి కార్యాచరణకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని పీడీపీ సమర్థించుకుంది. కశ్మీర్లో శాంతి స్థాపన కోసం రాష్ట్రంలోని భాగస్వాములందరితోను, నియంత్రణ రేఖకు ఆవల ఉన్నవారితోనూ చర్చలు జరపాలన్న అంశం సీఎంపీలో ఒక కీలక అంశమని పీడీపీ ప్రతినిధి, రాష్ట్ర మంత్రి నయీమ్ అక్తర్ పేర్కొన్నారు. ‘భాగస్వాములలో ఈ నేతలు(ఆలం తదితరులు) కూడా ఉన్నారు. ఎటువంటి బలమైన కారణాలూ లేకుండా వీరిని జైలులో ఉంచి చర్చలు జరపలేం’ అని అన్నారు. ఆలం సహా కొందరు నేతల విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని వారిని విడుదల చేశాయని.. ఆ ఉత్తర్వులను తాము అమలు చేశామని చెప్పారు. బీజేపీ వ్యతిరేకతపై ప్రశ్నించగా బహిరంగ చర్చకు వెళ్లడం తమకు ఇష్టం లేదని, వారి అభిప్రాయాలు వారికి ఉంటాయనిన్నారు.
'ఆలం విడుదల'పై నివేదిక కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆలం విడుదలకు దారితీసిన పరిణామాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ.. కేంద్ర హోంశాఖలోని జమ్మూకశ్మీర్ విభాగానికి చెందిన అధికారులు విధులకు హాజరై.. మస్రత్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మస్రత్పై రణ్‌బీర్ పీనల్ కోడ్ (జమ్మూకశ్మీర్ రాష్ట్ర చట్టం) లోని సెక్షన్ 120, సెక్షన్ 121ల కింద (దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటం), చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధం) చట్టం కింద కేసులతో సహా దాదాపు 15 కేసులు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మస్రత్ విడుదల ఉదంతంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉండటంతో.. దీనిపై ప్రభుత్వ వైఖరిని సిద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రంగంలోకి దిగినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ కూడా జమ్మూకశ్మీర్ డీజీపీ కె.రాజేంద్రతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.