ఆకర్షణీయంగా కార్పొరేట్ డిపాజిట్ రేట్లు
బ్యాంకులు వడ్డీరేటు తగ్గిస్తున్న ఫలితం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ రేట్ల తగ్గింపునకు త్వరలో బ్యాంకులకు సంకేతాలు ఇవ్వొచ్చన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని బ్యాంకులు... ఇందుకు అనుగుణంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ దిశలో మెచ్యూరిటీల డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గింపు నిర్ణయాలు తీసుకున్నాయి.
మరికొన్ని సైతం ఇదే ప్రణాళికల్లో ఉన్నాయి. రుణ రేటు తగ్గిస్తే... తమ మార్జిన్లను తగిన స్థాయిలో కొనసాగించుకోడానికి బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ అయిన డబ్బుకూ వడ్డీరేటు తగ్గించక తప్పదు. ఈ పరిస్థితుల్లో బ్యాం కుల్లో డబ్బు డిపాజిట్ రేటుకన్నా... కంపెనీల్లో డిపాజిట్ రేటు అధికంగా ఉంటున్న పరిస్థితి ఇప్పటికే నెల కొంది. దీనితో ఇప్పుడు కార్పొరేట్ డిపాజిట్లు మదుపరులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. బ్యాంకులతో పోల్చితే కొంత రిస్క్ ఉన్నందువల్ల... ‘ఇన్వెస్టర్’ కొంత రిస్క్‌కు సిద్ధపడితే కార్పొరేట్ డిపాజిట్ల నుంచీ మెరుగైన రిటర్న్స్ పొందే వీలుంది.
పెరిగిన ఆఫర్ రేటు వ్యత్యాసం
సాధారణంగా బ్యాంకులు-కంపెనీలు ఆఫర్ చేసే డిపాజిట్ రేటు మధ్య 50 నుంచి 70 బేసిస్ పాయింట్ల వ్యత్యాసం (100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతానికి సమానం) ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యత్యాసం దాదాపు 100 బేసిస్ పాయింట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, మహీంద్రా ఫైనాన్స్, దివాన్ హౌసింగ్ వంటి సంస్థలు బ్యాంకులతో పోల్చితే అధిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి.
కంపెనీలు కొన్ని మూడేళ్ల మెచ్యూరిటీలకు సంబంధించి 10.50 శాతం వరకూ డిపాజిట్ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అందిస్తున్న శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్ స్కీమ్ 1,2,3 సంవత్సరాల కాలాల డిపాజిట్ స్కీమ్‌లపై వరుసగా 10.50 శాతం, 9.75 శాతం, 9.25 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కార్పొరేట్ సంస్థలు వార్షికంగా 12.5 శాతం వరకూ డిపాజిట్ రేటు ఆఫర్ చేయవచ్చు. ప్రస్తుతం ఆఫర్లకు సంబంధించి ఈ శ్రేణి 9 శాతం నుంచి 12.25 శాతం వరకూ ఉంది.
నిబంధనల భరోసా...
నాన్-బ్యాంకింగ్ సంస్థల్లో స్థిర డిపాజిట్లు... ఇక్కడ దాచుకున్న డబ్బుకు భరోసా... వంటి అంశాలకు సంబంధించి చాలా మంది మదుపరులకు సందేహాలు తలెత్తడం సహజం. అయితే దీనిగురించి పెద్దగా ఆందోళన అక్కర్లేని పరిస్థితి ఉంది. ఆయా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రజల నుంచి డబ్బు సమీకరించే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తోంది. పూర్తి నియమ నిబంధనలు, నియంత్రణ సంస్థ మార్గదర్శకాల పరిధిలో ఈ డిపాజిట్ల సమీకరణ జరుగుతోంది. ఈ విషయంలో ఇన్వెస్టర్ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరిగింది. నామినేషన్ సదుపాయం కూడా మదుపుదారుకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...
కాల వ్యవధి: కార్పొరేట్ ప్రగతి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణంగా పరిస్థితులు మారిపోతుంటాయి. ఎగుడు, దిగుడులు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో తెలి యని పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ డిపాజిట్లు షార్ట్‌టర్మ్‌కు అయితే బెటర్. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, కార్పొరేట్ డిపాజిట్ స్కీమ్‌లు 12 నెలల నుంచి ఐదేళ్ల శ్రేణిలో ఉంటాయి. అంటే డిపాజిట్ల వ్యవధి ఏడాదికన్నా తక్కువ ఉండదు. ఐదేళ్లు మించడానికీ వీలులేదు.
ముందస్తు ఉపసంహరణకు వీలు: నాన్ బ్యాంక్ స్థిర డిపాజిట్ స్కీమ్‌ల విషయంలో డిపాజిట్ చేసిన కాలానికన్నా ముందుగానే డబ్బు వెనక్కు తీసుకునే వీలుంది. అయితే మూడు నెలల ‘లాక్-ఇన్-పిరియడ్’ ఇక్కడ అమలవుతోంది. అటు తర్వాత ముందస్తుగా డబ్బు ఉపసంహరించుకుంటే ఆ మేరకు వడ్డీరేట్లలో మార్పులు, అలాగే జరిమానాలు నియమ నిబంధనల ప్రకారం అమలు జరుగుతాయి.
రెండు రకాల స్కీమ్‌లు: సహజంగా రెండు రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉంటాయి. చేసిన డిపాజిట్‌పై ‘ఎప్పటికప్పుడు’ ప్రాతిపదికన ఆరునెలలకు ఒకసారి, వార్షికంగా వడ్డీని వెనక్కు తీసుకునే అవకాశం ఇందులో ఒకటి. ఇలాకాకుండా మెచ్యూరిటీ అయిన తరువాత డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా తీసుకునే వెసులుబాటూ ఉంది.
రేటింగ్: నిధులు పరిమాణం, పనితీరు, ప్రమాణాల ప్రాతిపదికన క్రిసిల్, ఇక్రా వంటి రేటింగ్ సంస్థలు... డిపాజిట్ ప్రొడక్టులు అందిస్తున్న నాన్-బ్యాంకింగ్ కంపెనీలకు రేటింగ్‌ను ఇస్తాయి. ఏ కంపెనీకి ఎటువంటి రేటింగ్ ఉంది? ఎక్కడ ఇన్వెస్ట్‌చేస్తే మంచింది? వంటి అంశాలను మదుపుదారుడు స్వయంగా నిర్ణయించుకునే వీలుంది.