కట్టడి చేస్తున్నా...కేసులు పెరుగుతున్నాయ్!
దాదర్: ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు (ఏసీబీ)అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబైలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది హెచ్ఐవీ రోగులన్నుట్లు తేలింది. ప్రస్తుతం ముంబైలో 40,658 హెచ్ఐవీ రోగులున్నట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనజాగృతి కార్యక్రమాల చేపడుతోంది. నేటి ఆధునిక యుగంలో కొత్తకొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. రోగులు కూడా ఆయుర్వేదం జోలికి పోకుండా ఆధునిక మందులు, మాత్రలను వాడుతున్నారు. అయినా ముంబైలో ఏటా మూడు వేలమందికి వ్యాధి నిర్ధారణ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో బయటపడుతున్న కొత్త రోగుల్లో 75 శాతం 15–49 ఏళ్ల మధ్య వయసున్న వారున్నారు. వీరిలో 31 శాతం మహిళలున్నారు. అనేక సందర్భాల్లో రక్షణ ప్రమాణాలు పాటించకుండా లైంగిక సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాల వల్ల ఈ వ్యాధి సోకుతోందని వైద్య పరిశీలనలో తెలిసింది. హెచ్ఐవీ గురించి భారీగా అవగాహన సదస్సులు, జనజాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్ద మొత్తంలో ఎయిడ్స్ కేసులు బయటపడుతుండటంతో ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తగ్గిన వివక్ష... హెచ్ఐవీ రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొద్ది సంవత్సరాల నుంచి నియంత్రణ కమిటీ కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోగులు ఉన్నచోటే పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడం, ఒక్క ముంబైలోనే 20కి పైగా కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాటు చేసినట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ అదనపు డైరెక్టర్ డా.విజయ్‌కుమార్ కారంజ్కర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. గతంలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లోనే మందులు ఇచ్చేందుకు స్వతంత్రంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహారం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుందనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకుంటే ఎప్పటిలాగే జీవనం సాగిస్తారని రోగులకు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో హెచ్ఐవీ రోగులంటేనే వారి కుటుంబసభ్యులు, ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. వారి పట్ల బేధభావం ప్రదర్శించేవారు. వారు వాడే దుస్తులు, వస్తువులను వేరుగా ఉంచడంతోపాటు పడుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించేవారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలవల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో ఇలాంటి ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.