అతనొక పాదరసం!
గ్రంథపు చెక్క
చిన్నతనంలో... ఆజాద్‌కు మందుకూరి కాల్చే బొమ్మ తుపాకులాట మహా ఇష్టం. ఆ ఆట ఆడుకోవడానికి పటాసు కావాలి. కానీ డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు తోట తమ సొంతమే అనుకొని కొన్ని పళ్లను అమ్మి బెల్లమూ, పటాసు కొనుక్కున్నాడు. తండ్రి దృష్టిలో అది క్షమించరాని అపరాధం అయింది. విపరీతంగా కొట్టాడు. స్వాభిమాని అయిన ఆజాద్ ఇక ఇంట్లో ఉండలేక పోయాడు.
తల్లి అతి కష్టం మీద కూడబెట్టిన పదకొండు రూపాయలూ కొడుక్కి ఇచ్చింది. తండ్రికి చెప్పకుండా, విద్యలకు కేంద్రమైన కాశీకి వెళ్లిపోయాడు ఆజాద్. అక్కడ అతనొక సత్రంలో ఉండి లఘు కౌముది, అమరకోశం చదువుకున్నాడు. శాసనోల్లంఘన ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నరోజులవి. ఆ ఉద్యమం ఆజాద్‌ని బాగా ఆకర్షించింది. అప్పుడు ఆజాద్‌కు పదమూడు లేదా పద్నాలుగు ఏళ్ళుంటాయి. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు ఆజాద్. అరెస్ట్ చేసి మెజిస్ట్రేటు ముందు నిలబెట్టారు.
‘‘వేలెడు లేవు. పెద్ద ఉద్యమాన్ని నడపడానికి వచ్చావా? ఫో అవతలకి!’’ అన్నాడు మెజిస్ట్రేటు. ఆజాద్ కూడా మెజిస్ట్రేటును ఉద్దేశించి తిరస్కార భావంతో మాట్లాడాడు.
మెజిస్ట్రేటు, ఆజాద్‌కు 12 పేము బెత్తపు దెబ్బల శిక్షను విధించాడు. ప్రతి దెబ్బకూ ‘వందేమాతరం’, ‘మహాత్మాగాంధీకీ జై’ అంటూ నినాదాలు ఇచ్చాడు ఆజాద్. పేము బెత్తపు దెబ్బల శిక్షను అనుభవించి విడుదలయ్యాక, ఆజాద్ మరికొంచెం ఉత్సాహంతో ఉద్యమంలోకి దూకాడు.
చిన్నతనంలో ఆజాద్ చురుగ్గా ఉండేవాడు.
అతని చురుకుదనాన్ని చూసి మిత్రులు క్విక్ సిల్వర్ (పాదరసం) అని పేరు పెట్టారు!
- యశ్పాల్ ‘సింహావలోకన’ నుంచి (అనువాదం: ఆలూరి భుజంగరావు)
(రేపు స్వాతంత్య్రసమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి)