వ్యాపార వృక్షం
పిల్లల కథ
మేకల మదన్ మోహన్రావు
ఒకానొకప్పుడు తిమ్మయ శ్రేష్టి, తిప్పయ శ్రేష్టి అనే ఇద్దరు వర్తక మిత్రులు ఉండేవారు. ఇద్దరు కూడా పిత్రార్జితంగా వచ్చిన వ్యాపారాలు సమర్థవంతంగా చేస్తూ బాగా సంపాదించి, చక్కగా జీవించేవారు. పొరుగు దేశాలలో బాగా అమ్ముడుపోయే, మంచి గిరాకి ఉండే సుగంధ పరిమళ ద్రవ్యాలు, చీలి చీనాంబరాలు నావలలో పంపి బాగా డబ్బు గణించేవారు.ఒకసారి సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చి పడవలు మునిగిపోయాయి. బాగా ధనికులైన వాళ్లిద్దరూ ఒక్కరోజులోనే బికారులుగా మారారు.
కుటుంబాలతో పొరుగు దేశానికి పోయారు. అక్కడికెళ్లాక తిప్పయ శ్రేష్టి, తిమ్మయ శ్రేష్టితో, ‘‘మనమిద్దరం వేరు వేరు ప్రాంతాలలో వ్యాపారం చేద్దాం. అందువల్ల మనం ఒకరితో ఒకరు పోటీపడం. బాగా డబ్బు సంపాదించేదాకా కష్టపడి పనిచేస్తూ, పొదుపుగా జీవిద్దాం. ఏడాది తర్వాత ఇక్కడే కలుద్దాం’’ అన్నాడు. అలా చెరొక ప్రాంతంలో వ్యాపారాలు మొదలుపెట్టారు. తిప్పయ కష్టపడి పనిచేస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, వీలైనంత తక్కువ ఖర్చు చేస్తూ గడపసాగాడు. మళ్లీ ధనికుడై, తన అభిరుచికి తగ్గట్టుగా విశాలమైన భవనాన్ని నిర్మించుకున్నాడు.
తిమ్మయ వ్యాపారం కూడా త్వరలోనే పుంజుకుంది. అతడు ‘నా వ్యాపారం బాగా వృద్ధి చెందింది. డబ్బు బాగానే సంపాదిస్తున్నాను. ఇక మామూలుగా ఎందుకు బతకాలి? ’ అనుకున్నాడు.అప్పటి నుంచి తిమ్మయ డబ్బును మంచి నీళ్లలా ఖర్చుపెట్టసాగాడు. దాంతో ధనమంతా ఖర్చయి, మళ్లీ బీదవాడైపోయాడు.అప్పటికి ఏడాది అవటంతో తన మిత్రుడు తిప్పయను కలవటానికి వెళ్లాడు. తిమ్మయ తన బాధలు, కష్టాలు తిప్పయతో చెప్పుకున్నాడు. అతనికి ఆ దుస్థితి ఎందుకొచ్చిందో తిప్పయకు అర్థమైంది. అతణ్ని కొద్దిరోజుల పాటు తన దగ్గరే ఉండిపొమ్మన్నాడు.
తిప్పయ పనివాళ్లకు తిమ్మయకు సాదా భోజనం పెట్టమని చెప్పాడు. ఒకవారం దాకా ఎలాగో తిన్న తిమ్మయ అలాంటి భోజనం చేయలేకపోయాడు.మిత్రులిద్దరూ ఒక సాయంకాలం తోటలో పచార్లు చేస్తున్నప్పుడు తిమ్మయ అక్కడి చింతచెట్లను చూపిస్తూ, ‘‘నేను రోజూ చింతచిగురు తెంపుకుని అన్నంలో తినవచ్చా?’’ అని అడిగాడు. పరోక్షంగా తనకు పెట్టే భోజనం తనకు ఏమాత్రం రుచికరంగా లేదని తెలియజేస్తూ.తిప్పయ చిరునవ్వుతో, ‘‘అలాగే. ఇదిగో ఈ మొక్క ఆకులనే తెంపుకో’’ అని లేత చింతమొక్కను చూపించాడు.రోజూ ఆ మొక్క ఆకులు తెంపుకుని భోజనంలో కలుపుకోసాగాడు తిమ్మయ. ఆ మొక్కకు ఆకులన్నీ అయిపోయాయి. ‘‘ఆ మొక్కకు ఇంక ఆకులే లేవు. కాని దాని దగ్గర ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దాని ఆకులు, చిగురు తెంపుకోనా?’’ అన్నాడు తిప్పయతో.
‘‘అలాగే. అయితే ఆ చెట్టు ఆకులు కూడా ఎంత తొందరగా పూర్తి చేస్తే, అంత తొందరగా నీకు మధుర పదార్థాలతో భోజనం పెట్టిస్తా’’ అన్నాడు. తిమ్మయ సంతోషించాడు - ఇకనైనా మంచి భోజనం దొరుకుతుందని. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని ఆకులు తెంపినా, ఆ పెద్ద చెట్టు ఆకులు ఎంతకూ తరిగిపోవటం లేదు. ఆఖరికి నిరాశగా, ‘‘ఈ చెట్టు ఆకులు ఎంతకూ తరగట్లేదు. ఇవ్వాళ తెంపిన ఆకుల స్థానంలో రేపటికి కొత్త ఆకులు మొలుస్తున్నాయి’’ అని ఫిర్యాదు చేశాడు.
తిప్పయ నవ్వుతూ, ‘‘అవును. అది ప్రకృతి నియమం. ఆ చిన్న మొక్క మాదిరే నీ వ్యాపారంలో సంపాదించిందంతా అడ్డగోలుగా ఖర్చుపెట్టడంతో వట్టి పోయింది. కానీ నేను నా వ్యాపారం మహావృక్షంలా ఎదిగే దాకా ఓపిక పట్టాను. అందుకే ఇప్పుడు నేను విలాసవంతమైన జీవితం గడపగలను. నేను కూడా నీలాగే ఖర్చుపెట్టి ఉంటే, నీ స్థితిలోనే ఉండేవాణ్ని. ఇప్పుడు నేను ఎంత ఖర్చుపెట్టినా నాకు లోటు రాదు. అంతగా నా వ్యాపార వృక్షం పెరిగింది’’ అన్నాడు.తిప్పయ తనకు ఏం బోధించాలనుకుంటున్నాడో తిమ్మయకు అర్థమైంది. ‘‘చక్కటి గుణపాఠం నేర్పావు. ఇంక సెలవు ఇప్పించు’’ అన్నాడు.తిమ్మయ మళ్లీ వ్యాపారాన్ని పెంచుకోవటానికి తగినంత ధనం అప్పుగా ఇచ్చాడు తిప్పయ.ఈసారి గతంలో చేసిన తప్పు చేయకుండా జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ, బాగా డబ్బు సంపాదించి తన మిత్రుని బాకీ తీర్చివేసి, భార్యాపిల్లలతో సుఖంగా జీవించసాగాడు తిమ్మయ.