మహిళా ప్రజెంటర్కు క్రిస్ గేల్ సారీ!
అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మహిళా టీవీ ప్రజెంటర్కు వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ సారీ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు జోక్ గా తీసుకోవాలని, వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన అన్నాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్ తరఫున ఆడిన క్రిస్ గేల్ మ్యాచ్ అనంతరం టెన్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రజెంటర్ మెల్ మెక్లాఫ్లిన్ తో అసభ్యంగా మాట్లాడాడు. 'నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం తాగేందుకు వెళ్దామా.. సిగ్గుపడకు బేబీ' అంటూ ఆయన పేర్కొన్నాడు.
ఆయన వ్యాఖ్యలపై బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ (బీబీఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి. క్రిస్ గేల్ వ్యాఖ్యలు అవమానకరమైనవని బీబీఎల్ వ్యాఖ్యానించింది. క్రిస్ గేల్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాటిని తాము జోక్ గా తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేన్ మెక్ గ్రాత్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన సంకేతాలిచ్చారు. వివాదం చినికిచినికి ముదురుతుండటంతో క్రిస్ గేల్ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రజెంటర్ మెల్ పట్ల తాను అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె తన వ్యాఖ్యలకు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను జోక్ గా తీసుకోవాలని, వాటిని పెద్దగా పట్టించుకోవద్దని ఆయన పేర్కొన్నారు.