లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వాలు చెల్లవు
లైంగికదాడికి పాల్పడిన నిందితుడు శిక్షను అనుభవించాల్సిందే. ‘స్త్రీ దేహం ఆమెకు దేవాలయం. ఆమె శరీరం మీద పూర్తి హక్కు ఆమెదే. స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరచే ఒప్పందాలతో ఆమె సమాధానపడాల్సిన అవసరం లేదు. లైంగికదాడి బాధితురాలి తల్లిదండ్రులతో నిందితుడు ఎలాంటి మధ్యవర్తిత్వం నెరపడానికి వీల్లేదు. పెళ్లి చేసుకుంటానని, నష్టపరిహారం చెల్లిస్తానని ప్రలోభాలకు గురిచేసి కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదు. నేరస్తుడు శిక్ష అనుభవించాల్సిందే’ అంటూ సుప్రీంకోర్టు 2015లో సంచలనాత్మక తీర్పునిచ్చింది.
ఈ తీర్పుకి కారణమైన కేస్?
మధ్యప్రదేశ్లో ఏడేళ్ల బాలికపై 2008లో లైంగికదాడి జరిగింది. నిందితుడు దోషిగా తేలడంతో సెషన్స్కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్షరద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్ట్కి అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్ట్ నేరస్థుడి శిక్షను తగ్గించి ఏడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే నాటికే ఏడాది కాలం పట్టింది కాబట్టి శిక్ష పూర్తయినట్లేనంటూ కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది.
అదే సమయంలో తమిళనాడులో ఒక లైంగికదాడి కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా బాధితురాలు మైనర్ బాలికే. లైంగిక దాడి కారణంగా ఆమె గర్భవతి కూడా అయింది. మద్రాస్ హైకోర్ట్ జడ్జి.. ఆ అమ్మాయితో ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం నిందితుడిని పెళ్లిచేసుకో’ అంటూ రాజీ కుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆ తీర్పుతోపాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ ‘స్త్రీ శరీరం ఆమె దేవాలయం. ఆ దేవాలయం మీద ఎలాంటి దాడి అయినా నేరమే. ఈ నేరానికి శిక్ష అనుభవించకుండా రాజీ, సెటిల్మెంట్ వంటివాటివి ఆమె ఆత్మగౌరవాన్ని భంగపరిచే ప్రయత్నాలే’ అనే రూలింగ్ ఇచ్చింది.
అసలు ఈ మధ్యవర్తిత్వం అంటే ఏంటి?
ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఏడీఆర్)... సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక కేసుకు సంబంధించిన పరిష్కారమార్గాల్లో మధ్యవర్తిత్వం కూడా ఒక పద్ధతి అన్నమాట. సులభంగా పరిష్కారమయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్కి జడ్జి రిఫర్ చేస్తారు.డబ్బు, సమయం వృథా కాకుండా, బాధితులకు మానసిక ఒత్తిడి సత్వర పరిష్కారమార్గాలను అందించేందుకు ఇవి తోడ్పడుతాయి.
మధ్యవర్తిత్వానికి వేటిలో వీలుంటుంది.. వేటిలో కుదరదు?
సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న హత్యలు, డెకాయిటీ.. అంటే ఐపీసీ 354, ఐపీసీ376, ఐపీసీ302, ఐపీసీ 304బి, ఐపీసీ306, ఐపీసీ 307 సెక్షన్ల కిందకు వచ్చే కేసులను మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేయరు. చేయకూడదు కూడా!