మిడుతూరు వద్ద పెళ్లి బృందం లారీ బోల్తా
పెద్దవడుగూరు/గుత్తి/అనంతపురం మెడికల్ : పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద 44వ నంబరు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి పెళ్లి బృందం లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు... పామిడికి చెందిన సురేఖకు, గుంతకల్లు మండలం వైటీ చెరువుకు చెందిన హరికి పెళ్లి నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. ముహూర్తం రోజైన మంగళవారం రాత్రి వధువు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్తులు దాదాపు 80 మంది వైటీ చెరువుకు లారీలో బయల్దేరారు.
పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ సుధీర్ మితిమీరిన వేగంతో వెళుతూ మిడుతూరు వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ చెల్లాచెదురుగా ఎగిరిపడటంతో రహదారి రక్తమోడింది. తీవ్రగాయాలతో రక్షించండి అంటూ హాహాకారాలు చేశారు. దాదాపు 60 మంది గాయపడటంతో గుత్తి, పామిడి, అనంతపురం, కర్నూలు ఆస్పత్రులకు 108, పోలీసు జీపులు, ప్రైవేట్ వాహనాల్లో తరలించారు. పెళ్లి కుమార్తె సురేఖ స్వల్పంగా గాయపడింది. గుత్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పామిడికి చెందిన బెస్త ఓబులేసు (38) చనిపోయాడు.
జే సీ సత్యనారాయణ, ఆర్డీఓ హుసేన్ సాబ్, తహశీల్దార్ ఆదిలింగయ్య, ఎంపీపీ వీరేష్, డీఎస్పీ రవికుమార్, పెద్దవడుగూరు తహశీల్దార్ వెంకటశేషు, డిప్యూటీ తహశీల్దార్ సౌజన్యలక్ష్మీ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేఈ సురేష్‌గౌడ్, మాల మహానాడు జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. లారీ బోల్తాపడిన అనంతరం డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగంతోపాటు సామర్థ్యానికి మించి ప్రయాణించడం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జేసీబీ తెప్పించి రోడ్డుపై నుంచి లారీని పక్కకు తీసి రూట్ క్లియర్ చేశారు.
క్షతగాత్రులు వీరే... : పామిడికి చెందిన ఓబుళపతి, సువర్ణ, వసంత, భరత్, ఖాసీం, పుల్లమ్మ, పురుషోత్తం, ప్రవీణ్, భాగ్య మ్మ, గుర్రమ్మ, శివ, రేణుక, జిలాన్, శివశంకర్, సుధాకర్, సురేష్, శింగనమలకు చెందిన కృష్ణమూర్తి, రమాదేవి, శ్రీవాణి, విష్ణువర్ధన్, పాపయ్య, మైథిలి, మధు, సునీల్, చిట్టూరుకు చెం దిన సునీల్, కొప్పల కొండకు చెందిన లక్ష్మిదేవి, ఎర్రి స్వామి, సుంకులమ్మ, నారాయణస్వామి, బెస్తరవి, సాల మ్మ, రాజు , మహేష్, యగ్నేష్, చలపతి, వంశీకృష్ణ, లక్ష్మిదేవి, నాగరాజు, లక్ష్మిదేవి, కాశీం వలి, నడిపి సుంకన్న, పెద్ద పుల్లమ్మ, జిలాన్‌బాషా, శాంతి, రమాదేవి, పాపులమ్మ తదితరులు ఉన్నారు.
మిన్నంటిన ఆర్తనాదాలు: గాయపడినవారి ఆర్తనాదాలతో గుత్తి, అనంతపురం సర్వజనాస్పత్రులు మారుమోగాయి. అనంతలో దాదాపుగా 25 మందికి పైగా ఉన్న క్షతగాత్రులకు ఒకే చోట వైద్యం అందించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, సర్జికల్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామినాయక్, క్యాజువాలిటీ హెచ్ఓడీ డాక్టర్ శివకుమార్ వైద్య సేవలందించడానికి చర్యలు చేపట్టారు. హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థినులు, సెక్యూరిటీ సిబ్బం ది, జిల్లా ఎపిడమిక్ ధర్మసింగ్ బృందం సేవలందించారు. అనంతపురం తహ శీల్దార్ లక్ష్మినారాయణ పరిస్థితిని సమీక్షంచారు.