విలు విద్యలో రాణిస్తున్న మిహిర్ నితిన్ అపర్
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మిహిర్ నితిన్ అపర్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ కాంపౌండ్ బాలుర విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాకు చెందిన ఈ 16 ఏళ్ల చిచ్చరపిడుగు ఇప్పటికే పలు టోర్నమెంట్లలో పతకాలు సాధించి.. భవిష్యత్‌లో దేశానికి మరిన్ని పతకాలు తేవాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నాడు.
గతేడాది ఆగస్టులో పోలాండ్‌లో జరిగిన వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వయంగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని మిహిర్‌ను ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మిహిర్ తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేస్తున్నారు. పేరెంట్స్ పోత్సాహం, కోచ్ చంద్రకాంత్ ఇలాగ్ మార్గదర్శకత్వంతో మిహిర్ ఆర్చరీలో రాణిస్తున్నాడు.
మిహిర్‌కు ఆత్మీయ సత్కారం
విలు విద్యలో దూసుకుపోతున్న మిహిర్ నితిన్ అపర్‌ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సారంగపాణి సాదరంగా సన్మానించారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో మిహిర్‌తో పాటు అతడి తండ్రిని చిరు సత్కారంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ కార్టూనిస్ట్ నారూ, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో!! ఎందుకంటే..)