సమయం చూసి.. కిమ్ బల ప్రదర్శన
ప్యాంగ్యాంగ్ : సద్దుమణిగిందనుకున్న ఉత్తరకొరియా వివాదం మళ్లీ రాజుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఒప్పుకోవడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలు మొదలవుతాయని, శాంతి మార్గాలను కొరియా దేశాలు అన్వేషిస్తాయని అందరూ భావించారు.
అయితే, ఓ వైపు శీతాకాల ఒలింపిక్స్‌కు ప్లేయర్లను, మాజీ ప్రేయసి, సోదరిని పంపిన కిమ్.. గురువారం సైనిక కవాతును నిర్వహించారు. ఈ మేరకు ఉత్తరకొరియా అధికార మీడియా సంస్థ కవాతును ప్రసారం చేసింది. ఉత్తరకొరియా గతంలో నిర్వహించిన సైనిక బల ప్రదర్శనలతో పోల్చితే ఇది అతి చిన్నది. బల ప్రదర్శనకు సతీ సమేతంగా హాజరైన కిమ్.. సాయుధ దళాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరకొరియా వద్ద ప్రపంచ స్థాయి బలగాలు ఉన్నాయన్నారు. ఈ పరేడ్‌లో అణ్వస్త్ర సామర్ధ్య ఖండాంతర క్షిపణులైన హ్వసంగ్-14, హ్వసంగ్-15లను ప్రదర్శించారు. ఇలా పరేడ్‌లో ఉత్తరకొరియా క్షిపణులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియా బల ప్రదర్శనపై దక్షిణ కొరియా ఇంకా స్పందించలేదు.