పాల టోకెన్లు, గిఫ్ట్ కూపన్లు
న్యూఢిల్లీ: పాల టోకన్లు, గిఫ్ట్ కూపన్లు, ఫోన్ రీచార్జి కూపన్లు..! జయలలిత మరణంతో ఖాళీ అయిన తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పార్టీలు ఎరవేసిన తాయిలాల్లో ఇవి కొన్ని మాత్రమే. కాదేదీ లంచానికి అనర్హం అన్న రీతిలో పార్టీలు సరికొత్త లంచాలకు తెరతీసినట్లు ఎన్నికల సంఘం దర్యాప్తులో తేలింది. అన్నాడీంకే(అమ్మ) వర్గం ఓటర్లకు రూ.90 కోట్లు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికలను ఈసీ రద్దు చేసింది.
ఎన్నికల నిబంధనల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో కొత్తకొత్త మార్గాల్లో లంచాలకు తెరతీస్తున్నారని ఈసీ 33 పేజీల రద్దు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్కే నగర్లో పార్టీలు దినపప్రతికల చందాలు, బ్యాంకు ఖాతాల్లో, మొబైల్ వ్యాలెట్లలలో డబ్బులు తదితర మార్గాల్లో లంచాలు ఎరవేశారంది. రూ.18.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తమ పార్టీని దెబ్బతీయడానికి కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిందని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కే నగర్లో ఆ పార్టీ అభ్యర్థి దినకరన్ ఆరోపించారు.