విద్యుత్ కొరత
దొడ్డబళ్లాపురం : రాష్ర్టంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, అయినా లోడ్ షెడ్డింగ్ లేకుండా చర్యలు చేపట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అన్నారు. తాలూకాలోని కనసవాడిలో ఇటీవల వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైటెన్షన్ విద్యుత్ తీగలు వృుతి చెందిన ఐదుగురి కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించి, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 9లక్షలు చొప్పున పరిహారం చెక్కులను అఆయన అందజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ... ప్రైవేట్ కంపెనీలు అనుమతి పొందిన భూగర్భ మైనింగ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై తీవ్రంగా చూపుతోందని అన్నారు.
రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి కూడా గణనీయం తగ్గిందని అన్నారు. ఈ కొరతను పూడ్చేందుకు మరమ్మతులో ఉన్న విద్యుత్ స్థావరాలను పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. నిరంతర జ్యోతి పథకం కింద విద్యుత్ సరఫరాకు కొత్త కనెక్షన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో పింగాణి ఇన్సులేటర్లును పూర్తిగా మార్చి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇకపై రాష్ట్రంలో ఎలాంటి ఉత్సవాలు, ఊరేగింపులకయినా విద్యుత్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇదే కార్యక్రమంలో బాధిత ప్రతి కుటుంబానికి రూ.25వేలు చొప్పున స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య సాయమందించారు.