ఇవేం పనులు
మిషన్ పనులపై కలెక్టర్ అసంతృప్తి
ఎల్లారెడ్డిగూడెం చెరువు ఆకస్మిక తనిఖీ
అధికారులపై ఆగ్రహం వారంలో మళ్లీ వస్తానని హెచ్చరిక
ఎల్లారెడ్డిగూడెం(రఘునాథపల్లి) : ‘చెరువులోకి సాఫీగా వర్షపు నీరు వచ్చేందుకు ఫీడర్ చానల్ పనులు ఎందుకు చేర్చలేదు... క ట్టకు ముళ్ల చెట్లు ఎందుకున్నాయి.. తీసి వేసిన మొట్లు చెరువులో అలాగే ఉంచుతారా.. ఇవేం పనులు.. ఇలాగేనా’ అంటూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఇరిగేషన్ ఏఈ జయపై ఫైర్ అయ్యారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలోని గూడెం చెరువు మిషన్‌కాకతీయ పునరుద్ధరణ పనులను ఆమె సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పనులు ఎంత వరకు అయ్యాయని కలెక్టర్ ఏఈని అడుగగా 10 వేల క్యూబిక్ మీటర్ల పూడకతీతతో పనులు పూర్తవుతాయని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే ఫీడర్ చానల్ పనులు చేపట్టాలని ఆదేశించారు. తొలగించిన చెట్ల మొట్లు చెరువులో ఉండడాన్ని చూసి ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నల వర్షం కురిపించా రు. చెరువు పనులను ఎప్పటి కప్పుడు తహసీల్దార్, ఎంపీడీఓ పర్యవేక్షించాలని సూచించారు. చెరువు పనులు అధ్వానంగా ఉన్నాయని, సాయంత్రం వరకు తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఏఈని ఆదేశించారు. వారం రోజుల్లో మళ్లీ చెరువును సందర్శిస్తానని అధికారులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.
రూ.100తో పూడిక మట్టి పోసుకోలేకపోతున్నాం
చెరువులోని పూడిక మట్టిని ట్రాక్టర్‌కు రూ.100 ఇచ్చి తీసుకలేకపోతున్నామని, ఉచితంగా పోయాలని గ్రామానికి చెందిన మహిళా రైతు దుబ్బాక లలిత కలెక్టర్ వద్ద వాపోయింది. ట్రాక్టర్ కిరాయిలు రైతులే భరించాలని పూడకి మట్టితో పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాక్టర్ యజమానులు ఎక్కువ మొత్తం డిమాండ్ చేయకుండా రూ.80కే పూడిక మట్టి రైతులకు అందేలా అధికారులు చొరవచూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, నిడిగొండ సింగిల్‌విండో చైర్మన్ పెంతారెడ్డి ఎల్లారెడ్డి, తహసీల్దార్ జయమ్మ, ఎంపీడీఓ బానోతు సరిత, ఏఆర్ఐ అనిల్‌బాబు, వీఆర్ఓ రమేష్ పాల్గొన్నారు.