కళ్ల ముందరి కపట ప్రపంచాలు!
ఈ ఎన్నికల్లో మోడీ గనుక ప్రధానమంత్రి అయితే వస్తులౌల్యం, పిడివాదం రెండూ కూడా మరింత ప్రబలే ప్రమాదం లేకపోలేదు అని దర్శకురాలు పహూజా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తన చిత్రాన్ని విడుదల చేయడం వెనుక ఉన్న కారణం కూడా మహిళల్లో చైతన్యం తేవాలనే. చైతన్యం అంటే ఆవిడ ఉద్దేశం... స్త్రీలకు వ్యతిరేకంగా స్త్రీలకు తెలియకుండా జరుగుతున్న ఈ పురుషాధిక్య సమాజపు అన్నిరకాల కుట్రలపై స్త్రీలను మేల్కొల్పడం.
క్లినిక్‌లో తన ఎదురుగా కూర్చొని వున్న యువతివైపు సాలోచనగా చూశారు జమునా పాయ్. ముంబైలో ప్రముఖ కాస్మెటిక్ సర్జెన్ ఆవిడ. ఆమె పరీక్షిస్తున్నది మిస్ ఇండియా పోటీలలో పాల్గొననున్న ఒక అమ్మాయిని. ‘‘గుడ్. కుందనపు బొమ్మలా ఉన్నావు. చుబుకం మీద చిన్న బొటాక్స్ ఇంజక్షన్ ఇస్తే చాలు, ముఖంపై కనిపిస్తున్న ఆ సన్నటి గీతలు కూడా మటుమాయం అవుతాయి’’ అన్నారు జమున. ఆ మాటలకు ఆ అమ్మాయి ముఖం వికసించింది. అందాల పోటీలో తనదే గెలుపు అన్నంతగా సంబరపడింది.
ఔరంగాబాద్‌లోని ఓ క్లాస్ రూమ్. నిండైన చీరకట్టులో ఉన్న ఒక నడి వయసు స్త్రీ, తన ముందున్న ఆడపిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి అమె చెప్పవలసింది ఉపాధి అవకాశాల గురించి. అందులో భాగంగా ‘సంస్కృతి, సంప్రదాయం’ ప్రస్తావనకు వచ్చాయి. అంతకు ముందే ఓ అమ్మాయి ‘‘మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు ఉద్యోగాలు చేయలేరా? ఊళ్లు ఏలలేరా?’’ అని ఎంతో ఆవేదనగా ప్రశ్నించింది.
ఆ ఆవేదనే టీచరు గారికి కోపం తెప్పించింది. ‘‘మగాడికి ఆడవాళ్లు ఎలా సమానం అవుతారు? గత ఐదువేల ఏళ్ల సంవత్సరాలుగా మనమేంటో మనకు తెలియదా? ఏనాడైనా పురుషుడికి దీటుగా స్త్రీ నిలబడగలిగిందా?’’ అని ఆమె గర్జించ పై రెండు సన్నివేశాలలోని పరస్పర విరుద్ధ సారాంశమే నిషా పహూజా లఘుచిత్రం (డాక్యుమెంటరీ) ‘ది వరల్డ్ బిఫోర్ హర్’లోని కథాంశం. వాస్తవానికి ఇది 2012 నాటి చిత్రం. అప్పట్లో ఇది చిత్రోత్సవాలలో తప్ప ఎక్కడా కనిపించలేదు.
ఇప్పుడు ఈ మే నెలలో దేశంలోని కొన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది. సందర్భం ఏమిటి? ఉంది. పై రెండూ... విశ్వహిందూ పరిషత్‌లోని పిడివాద విభాగం ‘దుర్గా వాహిని’ నేతృత్వంలో, ‘మిస్ ఇండియా’ అందాల పోటీల ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా శిబిరాల్లోని సన్నివేశాలు. సిద్ధాంతాల పరంగా పైకి అవి వేర్వేరుగా కనిపించినా వాటి ఉద్దేశాలు, అంతరార్థాలు ఒకటేననీ; రెండూ కూడా మహిళలకు అలా చెయ్యాలనీ, ఇలా చెయ్యకూడదనీ చెప్పేవేననీ పహూజా అంటారు.
వాళ్లని సొంత ఆలోచనలు చెయ్యనీయకుండా, సొంత నిర్ణయాలు తీసుకోనీయకుండా, తమ కాళ్లపై తాము నిలబడకుండా ఈ పితృస్వామ్య వ్యవస్థ రకరకాల రూపాలలో మహిళలపై ఆధిపత్యం చెలాయిస్తోందని పహూజా ఆరోపణ. ఇవి రెండూ కూడా ‘తిరోగమన ప్రగతి’ దృక్పథాలేనన్నది ఆమె వాదన. ‘దుర్గావాహిని’ మహిళల ఆలోచనలను నియంత్రిస్తే, అందాల పోటీలు మహిళల దేహాన్ని నియంత్రిస్తున్నాయని పహూజా ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ చిత్రంలో చూపించారు.
పహూజా ఈ చిత్రాన్ని 2008లో మొదలు పెట్టినప్పటికీ, అది పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది! కెనడాలో జన్మించిన ఈ భారతీయ సంతతి మహిళ మొదట అందాలపోటీలపై ఒక డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అయితే వాటిని వ్యతిరేకిస్తున్న (ముఖ్యంగా స్విమ్ సూట్ రౌండ్లను) విశ్వహిందూ పరిషత్ వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకుని కథను విస్తృతం చేసుకున్నారు. రెండు ధోరణులనూ ఖండించారు.
‘‘దుర్గా వాహిని’ శిబిరంలోకి ప్రవేశం దొరకడానికే నాకు రెండేళ్లు పట్టింది. అక్కడ నేను ప్రాచి అనే శిక్షకురాలిని కలిశాను. ఆమె వయసు 24. తన జీవిత ధ్యేయం ఏమిటిని అడిగాను. ‘సాధ్వి’ స్థాయికి చేరుకోవడమేనని ఆ ఆమ్మాయి ఎంతో ఉత్సాహంగా చెప్పింది. సాధ్వి అంటే సాధ్వి ప్రజ్ఞాసింగ్. అతివాద కార్యకలాపాలు నెరిపిందంటూ ఆమెపై ఆరోపణలు ఉన్నాయి కదా అన్నప్పుడు, ప్రాచీ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను. ‘అయినా సరే నేనూ ఆమె స్థాయికి చేరుకోవాలి’ అని చాలా గట్టిగా చెప్పింది’’ అని పహూజా గుర్తుకు తెచ్చుకున్నారు.
భారతదేశంలోని వినిమయ సంస్కృతిని, పిడివాద ధోరణులను అర్థవంతంగా, ఆవేశ రహితంగా చూపిన‘ది వరల్డ్ బిఫోర్ హర్’ 2012 ట్రిబెకా (న్యూయార్క్) చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డును పొందింది. ఆ మాట అలా ఉంచితే, ‘‘ఈ ఎన్నికల్లో మోడీ గనుక ప్రధానమంత్రి అయితే వినిమయం, పిడివాదం రెండూ కూడా మరింత ప్రబలే ప్రమాదం లేకపోలేదు’’ అని పహూజా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తన చిత్రాన్ని విడుదల చేయడం వెనుక ఉన్న కారణం కూడా మహిళల్లో చైతన్యం తేవాలనే. చైతన్యం అంటే ఆవిడ ఉద్దేశం... స్త్రీలకు వ్యతిరేకంగా స్త్రీలకు తెలియకుండా జరుగుతున్న ఈ పురుషాధిక్య సమాజపు అన్నిరకాల కుట్రలపై స్త్రీలను మేల్కొల్పడం.