‘అమ్మ’కు అంకితం
సాక్షి, చెన్నై:ఏర్కాడు ఎమ్మెల్యేగా సరోజ పెరుమాళ్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆమె చేత అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. పెరుమాళ్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 4న ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ పోటీ పడ్డారు. అరుుతే 78 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సరోజ తిరుగులేని విజయాన్ని సాధిం చారు. లోక్సభ ఎన్నికలకు రెఫరెండంగా నిలిచిన ఈ ఎన్నిక విజయాన్ని సీఎం జయలలితకు సరోజ అంకితం ఇచ్చారు. తమ అధినేత్రికి ఈ విజయాన్ని కానుకగా అందించామన్న ఆనందంలో ఏర్కాడు అన్నాడీఎంకే నాయకులు సంబరాల్లో మునిగారు. విజయోత్సవ ఆనందాన్ని సీఎం జయలలితతో పంచుకునేందుకు ఉదయాన్నే సరోజ చెన్నైకు చేరుకున్నారు.రహదారుల శాఖ మంత్రి పళని స్వామితో కలసి జయ ఆశీస్సుల్ని అందుకున్నారు. తాను గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ అందజేసిన డిక్లరేషన్ ఫారాన్ని సీఎంకు అందజేశారు.
సరోజను ఆప్యాయంగా జయలలిత అక్కున చేర్చుకున్నారు. అనంతరం అసెంబ్లీ మందిరానికి వెళ్లారు. అక్కడ 12 గంటల 36 నిమిషాలకు జయలలిత సమక్షంలో ఎమ్మెల్యేగా సరోజ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత స్పీకర్ ధనపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. సరోజను ప్రత్యేకంగా సీఎం జయలలిత అభినందించారు. స్వీటు తినిపించి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఏర్కాడు విజయానికి తోడ్పడిన నాయకులు, కార్యకర్తలకు తన సందేశాన్ని జయలలిత పంపించారు. లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయూలని పిలుపునిచ్చారు.