భగ్గుమన్న తమ్ముళ్లు
పాచిపెంటలో టీడీపీ మండల సమావేశం
హాజరైన మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి
పాచిపెంట: మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్,ఎమ్మెల్సీ సంధ్యారాణి ఎడమోహం పెడమెహంతో ఉండడం వల్ల పార్టీ కార్యకర్తలకు పను లు జరగడం లేదని పలువురు టీడీపీ పాచిపెంట మండల నాయకులు అసహనం వెలిబుచ్చారు. మండల కేంద్రమైన పాచిపెంటలో త్రిమూర్తులు ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం టీడీపీ మండలస్థాయి సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణిల వ్యవహార శైలిపై పార్టీ నాయకులు దత్తి పైడిపునాయుడు,గురువునాయుడు పేట వైస్ సర్పంచ్ ముఖి శ్రీరాములు, గొట్టాపుతిరుపతిరావు తదితరులు మాట్లాడుతూ గ్రూపు రాజకీయాల వల్ల మండల అధికారులు ఏ పనులూ చేయడం లేదని, దీంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా మంది కార్యకర్తలు పార్టీని వీడే ప్రమాదముందని గురువునాయుడు పేట వైస్ సర్పంచ్ శ్రీరాములు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పూసర్ల నరిసింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్లు పొందిన వారికి మళ్లీ ఇళ్ల మంజూరు జాబితా పంపించడం వల్ల కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ భంజ్‌దేవ్, సంధ్యారాణిలపై భగ్గుమన్నారు.
మండల పోస్టుల్లో పక్కవారా?
పాచిపెంట మండలానికి చెందిన పారమ్మ కొండ కమిటీకి సంబంధించి సాలూరు ప్రాంతానికి చెందిన వారిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు.మండలానికి మంజూరైన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో కూడా మండలానికి చెందిన వారిని కాకుండా ఇతర మండలాలకు చెందిన వారిని నియమించడం ఏమిటని మండిపడ్డారు. పాచిపెంట పెద్దగెడ్డ జలాశయానికి సంబంధించి నీటి సంఘం అధ్యక్షుడుగా సాలూరుకు చెందిన వారిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం భంజ్‌దేవ్ మాట్లాడుతూ మండల అధికారులు పనులు చేసేలా తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ తరువాత సంధ్యారాణి మాట్లాడుతూ తమ మధ్య విభేదాలు లేవని ఇళ్ల ప్రతిపాదనలను అధికారులు పంపించారని, పార్టీ పరువు పోతుందని తానేమీ మాట్లాడలేదన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు లండ సత్యనారాయణ,కో ఆప్షన్ సభ్యుడు చోటా, పార్టీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.