టెల్కోలపై రూ.11 కోట్ల జరిమానా
మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు గాను టెలికాం ఆపరేటర్లపై ప్రభుత్వం జరిమానా విధించింది. రూ.10.8 కోట్ల జరిమానా విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జరిమానా నేపథ్యంలో రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజారోగ్యంపై ఏర్పడే ప్రభావిత అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. 2016 జూలై 31 వరకు టెలికాం డిపార్ట్మెంట్ మొత్తం 3.19 లక్షల బేస్ స్టేషన్లలో పరీక్షలు నిర్వహించింది.ఈ పరీక్షల్లో కొన్ని బేస్స్టేషన్లలో టెలికాం కంపెనీలు మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. దీంతో టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం 10.8 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
పార్లమెంట్లో మంగళవారం నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్‌లో టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రేడియేషన్ నిబంధనలను 90శాతం కఠినతరంగా అమలుచేస్తున్నట్టు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 25-30 ఏళ్లలో మొత్తంలో 25వేల సర్వేలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిందని, ఏ అధ్యయనంలోనూ ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ సమావేశ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఉద్గార ప్రభావాలపై ప్రశ్నలు సంధించారు.
దేశంలో ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ మొబైల్ టవర్ల నుంచి వస్తున్న రేడియేషన్ ఉద్గారాలు, ప్రపంచ నిబంధనల కంటే ఎనిమిది రెట్లు అధికంగా ఉన్నాయని తేలినట్టు ఎంపీ రవీంద్ర కుమార్ జెనా ఆరోపించారు.మొబైల్‌ను అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే పదేళ్లలో బ్రెయిన్ ట్యూమర్ బారినపడే అవకాశముందని యూరోపియన్ అధ్యయనాన్ని,ఇదేమాదిరి స్వీడన్ రిపోర్టును ఆయన ప్రస్తావించారు. జెనా ఆందోళనలపై తాము విచారణ చేస్తామని టెలికాం మంత్రి హామి ఇచ్చారు. ఎవరైనా ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు రేడియేషన్‌లో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే, వారిపై కఠిన తప్పవని టెలికాం మంత్రి హెచ్చరించారు. టెలికాం మంత్రి, జెనాలతో పాటు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.