modern period
-
పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ ఏట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు. 1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది. పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.) స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్ బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్’ (1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్జ్వరిల్లజేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ. తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి. -
అందమైన మూడు ముళ్లు
మంచి ఆనవాయితీ ఆధునిక కాలం పెళ్లిళ్లు మరింత అర్థవంతమవుతున్నాయి. వెనుకబాటుతనాన్ని వదులుకుంటున్నాయి. అందుకు దేశంలో జరిగిన ఈ మూడు ఉదంతాలే మూడు ముళ్లుగా నిలుస్తున్నాయి. ‘పెళ్లికి ఏం నగలు కావాలి.. ఎన్ని చీరలు కొనాలి?’అని కాబోయే అత్తమామలు అడిగితే ఎవరైనా ఎగిరిగంతేసి తమకు ఏమేమి కావాలో చాంతాడంత జాబితా చదువుతారు. కాని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పర్యావరణ ప్రేమికురాలు మాత్రం ‘నాకు అవేవీ వద్దు, ఓ పదివేల మొక్కలు కొని ఇస్తే చాలు అంది. మొక్కే కానుక... మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని కిసిపురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల సైన్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంకా భదోరియాకి బాల్యం నుంచి పర్యావరణమన్నా, పచ్చదనమన్నా పిచ్చప్రేమ. ప్రకృతి పదికాలాలపాటు పచ్చగా పరిఢవిల్లాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా, కాలుష్యం కోరల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నా అడవులను పెంచటమే ఉత్తమ మార్గం అని విశ్వసించింది. ఇక్కడి ప్రజలు వివిధ అవసరాల కోసం విచ్చలవిడిగా చెట్లను కొట్టేస్తుండటం వల్ల భూములు బీళ్లుపడి నిస్సారంగా మారిపోతున్నాయని, వర్షాభావ పరిస్థితులు అలుముకుంటున్నాయని, మరికొంతకాలంపాటు ఇలాగే కొనసాగితే తమ గ్రామం కూడా బీడుపడిపోతుందని భయపడింది. ఈ పరిస్థితిని నివారించడం కోసమే ఆమె తన పెళ్లి సందర్భంగా ఓ పదివేల మొక్కలను కొనిమ్మని కోరింది. కాబోయే కోడలి వింతకోరికకు ముందు ఆశ్చర్యపడ్డా తర్వాత చాలా ఆనందపడ్డారు అత్తమామలు. ఇక పెళ్లికొడుకు రవి చౌహాన్ అయితే తన కాబోయే భార్య పర్యావరణ ప్రేమకు మురిసిపోయాడు. ఆమె కావాలని కోరిన మొక్కల్లో ఓ అయిదువేల మొక్కలు ఆమె పుట్టింట్లోనూ, మరో ఐదువేల మొక్కల్ని తమ పొలంలోనూ నాటించి నవ వధువు ముచ్చట తీర్చాడు పెళ్లికొడుకు. గురువుకు వందనం ఇలాంటి కొత్త ఆలోచనల పెళ్లి కూతురే నిషాద్‌బాను కూడా. గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషాద్బానుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తన పెళ్లి సందర్భంగా వివాహ వేదికను రకరకాల పూలతో, విద్యుద్దీపాలతో అలంకరించడం, పెళ్లి విందుకోసం వివిధ రకాల పదార్థాలను వండించడం తదితర వృధా ఖర్చుకు బదులుగా ఓ అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంది నిషాద్. అదేమంటే తనచేత ఓనమాలు దిద్దించినవారి నుంచి, కళాశాలలో ఉన్నతవిద్య బోధించిన వారివరకు గురువులందరినీ గుర్తుపెట్టుకుని, సన్మానించాలనుకుంది. ఓ రైతుకుటుంబంలో పుట్టిన నిషాద్‌బాను ఎంసిఎ చదివాక అదే గ్రామానికి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రమీజ్ మహమ్మద్‌ను పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే పెళ్లి కొడుకును ముందుగానే కలిసి అందరిలా కాకుండా అందరికీ చిరకాలం గుర్తుండిపోయేలా వినూత్న రీతిలో పెళ్లి చేసుకుందామని ఒప్పించింది. చదువును ప్రేమించే బాను తలిదండ్రులు కూడా అందుకు ఆనందంగా అంగీకరించి, పదిలక్షల రూపాయలు ఇచ్చి, నీకు నచ్చినట్లుగా చేయమంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. తలిదండ్రులిచ్చిన డబ్బుకు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు బహమతిగా ఇచ్చిన మొత్తాన్ని కూడా జత చేసి కేజీ నుంచి, పీజీ వరకు తనకు చదువు చెప్పిన గురువులలో 75మంది విశ్రాంత ఉపాధ్యాయులను పేరుపేరునా పెళ్లికి పిలిచి, కడుపునిండా విందుభోజనం పెట్టి, జ్ఞాపిక, శాలువా, కొంత నగదు ఇచ్చి, వారికి భక్తిశ్రద్ధలతో గురుద క్షిణ చెల్లించింది. వృద్ధాప్యం వల్ల లేదా ఇతర కారణాల వల్ల పెళ్లికి రాలేకపోయిన గురువుల వద్దకు భర్తను వెంటబెట్టుకుని స్వయంగా వెళ్లి మరీ సన్మానించి వచ్చింది. బాను పెళ్లికి వచ్చిన వారిలో చాలామంది అవివాహితులు తాము కూడా తమ పెళ్లికి ఇలానే చేస్తామని ఆమెకు మాట ఇవ్వడం గమనార్హం. బాల్య వివాహమా.. అయితే టెంట్లు అద్దెకిచ్చేది లేదు రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దురాచారం అంతమవుతుంది. ఈ మాటే ఆలోచించిన రాజస్థాన్‌లోని దాదాపు 47,000 మంది టెంట్ డీలర్లు బాల్యవివాహాలకయితే టెంట్లు, వంట సామగ్రి అద్దెకివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి టెంట్లు, వంటసామగ్రి తదితరాలను అద్దెకు కావాలని వచ్చే వారి దగ్గర వధూవరుల బర్త్ సర్టిఫికెట్లను పరిశీలించి, వారు మేజర్లని నిర్థారణ అయితే కానీ వారి ఇంట టెంట్లు వేసేదిలేదని వారు నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకవేళ తమ పరిశీలనలో అది బాల్యవివాహమని తేలితే గుట్టుచప్పుడు కాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మా ఆడపిల్లల మంచి భవిష్యత్తుకు మా నిరాకరణే ఒక కానుక అని వీరు అంటున్నారు. ఏప్రిల్ ఆఖరివారం ఉంచి మే మొదటివారం వరకు రాజస్థాన్‌లో పెళ్లిళ్ల సీజన్ అట. ఈ సీజన్లోనే బాల్యవివాహాలు జరిగే అవకాశం మెండుగా ఉందట. తమ లాభాలను సైతం కాదనుకుని, బాల్యవివాహాలను కనీసం ఈ విధంగానైనా ఆపాలని వీరంతా కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. -
వెలుగులీనే కెరీర్‌కు.. గ్రాఫిక్ డిజైనింగ్
అప్‌కమింగ్ కెరీర్: సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. గ్రాఫిక్ డిజైనింగ్. నేటి ఆధునిక యుగంలో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏదైనా వస్తువు వినియోగదారుడిని ఆకట్టుకోవాలంటే.. అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు ఏకైక మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు అన్ని రంగాల్లో గ్రాఫిక్స్ అనివార్యంగా మారాయి. దీంతో నైపుణ్యం కలిగిన డిజైనర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. దేశ విదేశాల్లో వీరికి మంచి వేతనాలు అందుతున్నాయి. ఇందులోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవసరానికి సరిపడ గ్రాఫిక్ డిజైనర్లు ప్రస్తుతం మనదేశంలో లేరని నిపుణులు చెబుతున్నారు. సృజనాత్మకతే ఏకైక సాధనం డిజైనర్లకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు వీరిని నియమిస్తు న్నాయి. అడ్వర్టైజింగ్, ప్రొడక్ట్ డిజైన్, లోగో డిజైన్, వార్తా పత్రికలు, వెబ్సైట్లు, పోర్టళ్ల డిజైనింగ్ వంటి వాటిలో అవకాశాలున్నాయి. ప్యాకేజింగ్ సంస్థలు, డిజైన్ స్టూడియోల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నగరాలతోపాటు ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ డిజైన్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. ఆసక్తి ఉంటే సొంతంగా ఒక స్టూడియోను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా వీరికి సంతృప్తికరమైన వేతనాలతో ఆఫర్లు అందుతున్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే.. సృజనాత్మకతే ఏకైక సాధనం. క్లయింట్లకు సంతృప్తిని కలిగించే ఔట్పుట్ ఇస్తే అవకాశాలకు, ఆదాయానికి లోటుండదు. వినియోగదారుల అభిరుచులను తెలుసుకొనే నేర్పు ఉండాలి. మార్కెట్లో ఎక్కడ అవకాశాలు లభిస్తాయో తెలుసుకోవాలి. ప్రారంభంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటే కెరీర్లో త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డిజైన్ ట్రెండ్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ రంగంలో ఫ్రీలాన్స్ డిజైనర్‌గా కూడా పనిచేసుకోవచ్చు. అర్హతలు: గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమాలో చేరాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేయొచ్చు. పీజీలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వేతనాలు: గ్రాఫిక్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు పనిచేసి నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే అందుకోవచ్చు. మనదేశంలో నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే డిజైనర్లు ఎందరో ఉన్నారు. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్: www.jnafau.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.nid.edu ఎంఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.mitid.edu.in ఆర్క్ ఆకాడమీ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.archedu.org ఎవర్గ్రీన్.. గ్రాఫిక్ డిజైనింగ్ శ్రీఅప్లయిడ్ ఆర్ట్స్/ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు ఎవర్గ్రీన్. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీటికి డిమాండ్ ఏర్పడుతోంది. గ్లోబలైజేషన్‌తో రిటైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వస్తువుల విక్రయానికి ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తులను ఎంత ఆకర్షణీయంగా రూపొందించి, వినియోగదారుల్లోకి తీసుకెళ్లగలిగితే అంతగా మార్కెట్ పెరుగుతుంది. ప్రకటనల నుంచి సినిమాల వరకూ అన్నిచోట్లా సృజనాత్మకతకే అగ్రస్థానం. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారంటే వారిలో ఎంతోకొంత క్రియేటివిటీ ఉందనే అర్థం. అకడమిక్‌గా ఎన్ని అర్హతులున్నా నైపుణ్యం లేకుంటే తమ రంగంలో రాణించలేరు. గ్రాఫిక్ డిజైనర్లకు ప్రకటనలు, మీడియా, ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంట్ డిజైన్, ప్రింట్, పబ్లికేషన్ ఇండస్ట్రీ, మల్టీమీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఇంటరాక్టివ్ మీడియా డిజైనర్స్, అడ్వర్టైజింగ్- కమ్యూనికేషన్, ప్యాకేజింగ్ డిజైనర్, క్రియేటివ్ ప్రొడక్ట్ వంటి విభాగాల్లో సొంతంగా పనిచేసుకోవడంతోపాటు మరికొంతమందికి ఉపాధి చూపించవచ్చ్ణు - ప్రొఫెసర్ బి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్