ఇండిగో మాన్సూన్ స్పెషల్ : టిక్కెట్ ధరెంతంటే..
చెన్నై : చౌక ధరల్లో విమానటిక్కెట్లను అందించే విమానయానసంస్థ ఇండిగో మూడు రోజుల మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ ను తీసుకొచ్చేసింది. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ కింద రూ.899కే టిక్కెట్ ధరను విక్రయిస్తోంది. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-గోవా, జమ్ము-అమృత్ సర్, ఢిల్లీ-ఉదయ్ పూర్, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్టు బ్లయిర్, హైదరాబాద్-ముంబై, కోల్ కత్తా-అగర్తల, ఢిల్లీ-కోయంబత్తూర్, గోవా-చెన్నై వంటి ఎంపికచేసిన మార్గాలకు ఈ టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనుంది.
అయితే ఈ స్పెషల్ ధరల ఆఫర్ ఫస్ట్-కమ్-ఫస్ట్ బేసిస్ లో అందుబాటులో ఉంచుతామని, ఒక్కసారి టిక్కెట్ బుక్ చేసుకున్నాక అవి మళ్లీ ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని ప్రకటన విడుదల చేసింది. సమ్మర్ స్పెషల్ సేల్ కు మంచి స్పందన రావడంతో, మూడు రోజుల ఈ మాన్ సూన్ సేల్ స్పెషల్ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. చెన్నైతో కనెక్ట్ అయ్యే కొన్ని రూట్ల టిక్కెట్లు ఈ విధంగా ఉన్నాయి..ముంబై-చెన్నై రూ.1,999కు, ఢిల్లీ-చెన్నై కు రూ.3,399కు, బెంగళూరు-చెన్నైకు రూ.1,199కు టిక్కెట్లను అందిస్తోంది. ఈ సమ్మర్ స్పెషల్ సేల్ ను మొత్తం 39 దేశీయ మార్గాలకు అందుబాటులో ఉంచింది.