‘పుల్వామా’పై రాజకీయ దాడి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న దాడి ఘటనకు ఏడాదైన సందర్భంగా భారత్‌లో రాజకీయ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూనే కేంద్రంపై మాటల తూటాలు విసిరాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు.
1. ఈ దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు?
2. ఈ దాడిపై విచారణ ఎంతవరకు వచ్చింది?
3. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి.. భద్రతా వైఫల్యానికి బీజేపీలో ఎవరిది బాధ్యత?
ఈ మూడు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు మద్దతుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గళం విప్పారు. పుల్వామా దాడిలో బతికి బయటపడిన వారికి ఎలాంటి సాయం అందించారని, మృతుల కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని ఆరోపించారు.
ఉగ్రవాదుల సానుభూతిపరుడు రాహుల్: బీజేపీ
జాతి యావత్తూ పుల్వామా దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తుంటే రాహుల్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతి పరుడైన రాహుల్ కేంద్రంతో పాటు భద్రతా బలగాలను కూడా టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. దోషి అయిన పాక్‌ను రాహుల్ ఎప్పుడూ ప్రశ్నించరెందుకని నిలదీశారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం ఇస్తున్నారని ట్వీట్ చేశారు.
పుల్వామా దాడిపై విచారణ పురోగతి కష్టమే
పుల్వామా దాడిపై విచారణ ముందుకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఈ దాడితో ప్రమేయం ఉన్న అయిదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు చేపట్టిన వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక విచారణ సంస్థ (ఎన్ఐఏ)కు ఈ దాడి వెనుక సూత్రధారి, ఇతర కుట్రదారులెవరు వంటి వివరాలు తెలుసుకోవడానికి కచ్చితమైన సమాచారమేదీ లేదు. ‘‘ఈ కేసులో ఎన్నో అంశాలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. కోర్టుల్లో ఏదైనా సాక్ష్యాధారాలతోనే సమర్పించాలి. అందుకే ఈ కేసులో పురోగతి సాధించలేం’’అని విచారణ బృందంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం కరడు గట్టిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై విద్వేషం వెళ్లగక్కారు. కశ్మీర్లో పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కారుబాంబుతో దాడి జరిపారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడి కోసం వినియోగించిన ఆ కారు యజమాని ఎవరన్నదే ఇప్పటికీ విచారణ బృందానికి సవాల్‌గానే మారింది.
మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని
‘పుల్వామా’అమరవీరులకు శుక్రవారం ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ హర్దీప్ పూరీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
పుల్వామా స్మారకం ఆవిష్కరణ
పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫోటోలను వారి పేర్లతో సహా ఆ స్థూపంపై చెక్కారు. అమరవీరుల కుటుంబాలకు తాము ఎంతో చేస్తున్నామని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ అనే వ్యక్తి మొత్తం 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అమరవీరుల ఇళ్లకు వెళ్లి అక్కడ మట్టిని తీసుకువచ్చి సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళిగా ఉంచారు.