నేడు రాజ్‌కుమార్ స్మారకం ఆవిష్కరణ
ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రజనీకాంత్, చిరంజీవి
బెంగళూరు : కన్నడ కంఠీరవుడు, ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకాన్ని శనివారం ఆవిష్కరించనున్నారు. కంఠీరవ స్టూడియోలోని డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన ఈ స్మారక ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, చలనచిత్ర వాణిజ్య మండలి చాలాప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. కాగా, కంఠీరవ స్టూడియోలోని రాజ్‌కుమార్ సమాధికి ఇరు వైపులా రాజ్‌కుమార్ నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే ప్రాంతంలో డాక్టర్ రాజ్‌కుమార్ సమాధికి ఎదురుగా ఒక నాటక మందిరాన్ని సైతం నిర్మించారు. ఇక ఈ స్మారక ఆవిష్కరణకు శాండల్‌వుడ్ చిత్రసీమతో పాటు వివిధ భాషలకు చెందిన సినీరంగ ప్రముఖులు హాజరుకానున్నారు. శనివారమిక్కడి కంఠీరవ స్టూడియోలో నిర్వహించే స్మారక ఆవిష్కరణ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు అలనాటి నటి బీ సరోజాదేవి, సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఇక రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ నేపథ్యంలో శనివారం శాండల్‌వుడ్ పరిశ్రమ సెలవుగా ప్రకటించింది. అంతేకాక రాజ్‌కుమార్‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు గాను శనివారం సాయంత్రం నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో కళ్లుచెదిరే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ ప్రముఖ నటీనటులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ ప్రదర్శనల కోసం ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఇప్పటికే భారీ సెట్‌ను కూడా రూపొందించారు. ఈ సాంృ్కతిక కార్యక్రమాల్లో ప్రముఖ నటీనటులతో పాటు మొత్తం 800 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం శాంతియుతంగా జరిగేందుకు అభిమానులంతా సహకరించాలని రాజ్‌కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కోరారు. రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమానికి శాండల్‌వుడ్‌తో పాటు వివిధ భాషలకు చెందిన సినీప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అభిమానులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.