ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు
ఒడిశాలో బాలసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు రోజులైంది. ఆ ఘటనలో చనిపోయిన వందలాది మందిలో ఇంకా గుర్తించలేని మృతదేహాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు తమవారెక్కడున్నారో తెలియక వెతుకులాటలో కొందరు కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని శోకం, అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కూతురు ఇదే ప్రమాదం బారిన పడ్డారు. దీంతో అతడు తన భార్య, కూతురు ఆచూకి కోసం ఎంతగానో తపించాడు. చివరికి మార్చురీలో ఎన్నో మృతదేహాలను చూసిన తర్వాత గానీ తన భార్యను గుర్తించలేకపోయాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, ఆ బాధను దిగమింగి కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమె బతుకుందా లేదా అన్న టెన్షన్‌తో నరకయాతన అనుభవించాడు ఆ వ్యక్తి. చివరికి జిల్లా కలెక్టర్, బాలాసోర్ నివాసితులు సాయంతో కూతురు కోసం భువనేశ్వర్‌కి బయలు దేరాడు ఆ తండ్రి.
అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మరో తండ్రి హేలారామ్ మాలిక్ తనకు ఈ రైలు ప్రమాదం గురించి తనకు తెలియదని కన్నీటిపర్యంతమయ్యాడు. తన కొడుకు ఫోన్ చేసి తాను తీవ్ర గాయాలతో ఉన్నాని, ప్రమాదం జరిగిందని చెప్పడంతో హుటాహుటినా ఇక్కడకు వచ్చానని చెప్పాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆ ఘటన జరిగిన రాత్రికే వచ్చినా.. కొడుకు ఆచూకి కానరాక ఆ తండ్రి ఎలా తల్లడిల్లాడో వివరించాడు. చివరికి తాను తన కొడుకుని మార్చురీలోనే గుర్తించానని, అపస్మారక స్థితిలో ఉంటే చనిపోయాడనుకుని రెస్క్యూ సిబ్బంది మార్చురీలో ఉంచినట్లు తెలిపాడు హేలారామ్.
ప్రస్తుతం అతని కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఎన్నో మిరాకిల్ ఘటనలు తోపాటు, కన్నీటిని మిగిల్చిన విషాద కథలు అక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వాస్తవానికి కొన్ని మృతదేహాలను వివిధ ప్రాంతాలకు తరలించడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అధికారులు ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో వాటిని పర్యవేక్షించడమే గాక గుర్తుపట్టేలా బాధితు కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నారు.
ఈ మేరకు బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ దత్తాతత్రేయ భౌసాహెబ్ షిండే మాట్లాడుతూ..తమకు రెండు కంటట్రోల్ రూంలు ఉన్నాయని, మృతదేహం ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు అని పేర్కొన్నారు. కాగా, ఇంకా 101 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు వెల్లడించారు.
(చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..)