తాగి వాహనం నడిపితే శవాల గదిలో సేవ చేయాలి
బ్యాంకాక్: తాగి వాహనం నడపడం ప్రపంచంలో ఎక్కడైనా నేరమే. అయితే ఈ నేరానికి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన శిక్షలు అమలు చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఉన్న శిక్ష మరెక్కడా లేదేమో! అక్కడ ఒక్కసారి ఆ శిక్షను అనుభవించినవారు మరెప్పుడు అలాంటి నేరానికి పాల్పడబోరని అక్కడి పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇంతకు ఆ శిక్ష ఏమిటంటే....ఆస్పత్రి శవాల గదిలో సేవ చేయడం. వాహనం నడుపుతున్నప్పుడు ఎంత తాగావు? అన్న అంశాన్ని బట్టి ఎన్ని రోజులు శవాల గదిలో పనిచేయాలనేది ఆధారపడి ఉంటుంది.
శవాల గదిలో సేవ చేయడం వల్ల మనిషి ప్రాణం విలువేమిటో, ప్రాణం పోవడం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా తెలియజేయడం కోసమే ఇలాంటి శిక్షలు వేయాలని నిర్ణయించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి శవాల గదిలో సేవ చేసినట్లయితే ఇక ఎప్పుడు మద్యం తాగి వాహనం నడిపేందుకు ఎవరూ సాహసించరనేది తమ విశ్వాసమని, ఇటీవలనే తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిందని వారు చెప్పారు.
అసలే అంతంతమాత్రంగా ఉండే థాయ్ రోడ్లపై సురక్షితంగా వాహనం నడపడమే ఓ సాహసం. అలాంటి రోడ్లపై తాగి నడపడం అంటే ప్రాణాంతకమే. థాయ్‌లో ప్రతి ఏటా 24 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాద మృతుల్లో 25 శాతం మంది తాగి వాహనం నడపడం కారణంగానే మరణిస్తున్నారని, దేశవ్యాప్తంగా మొత్తం చావుల్లో ఈ మరణాలు ఐదు శాతం ఉంటున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.
మొత్తం తాగి నడిపిన కేసుల్లో కొత్త సంవత్సరం వేడుకల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వేడుకల్లో ఏడు రోజులపాటు బీభత్సంగా తాగుతారు. తాగి నడుపుతారు. ఎన్నో హెచ్చరికలు చేసినా, ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా, కఠిన చర్యలు తీసుకున్నా ఇలాంటి ఆగడాలకు తెరపడడం లేదు. అందుకని శవాల గది సేవలలాంటి శిక్షలతోని ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.