ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఏడాది జైలు
నిజామాబాద్ లీగల్ : అతి వేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ బుధవారం ప్రత్యేక ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ యువరాజ తీర్పు వెల్లడించారు. సంఘటనకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ముబారక్‌నగర్ సాయిప్రియ రెసిడెన్సీలో నివాసముండే శెర్ల సాయన్న మాక్లూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నాడు. 2013 మార్చి 31న పాఠశాలకు కారులో వెళ్తూ దాస్‌నగర్ వద్ద మాక్లూర్ మార్గంలో కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌పై వెళ్తున్న మాక్లూర్‌కు చెందిన నీరడి ప్రవీణ్‌కుమార్‌ను ఢీకొట్టాడు. దాస్‌నగర్‌కు చెందిన మలావత్ రాజు అనే యువకుడు ప్రవీణ్‌కుమార్‌ను లిఫ్ట్ అడిగి బైకు వెనకాల కూర్చున్నాడు. ఇతడికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ప్రవీణ్‌కుమార్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటనపై మాక్లూర్ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. బుధవారం కేసు పూర్వపరాలు పరిశీలించిన జడ్జి యువరాజ ముద్దాయి సాయన్నపై నేరం రుజువు కావడంతో ఏడాది పాటు సాధారణ జైలుశిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరోమూడు నెలల పాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు.
దొంగతనం కేసులో ముగ్గురికి ఏడు నెలల జైలు
మాక్లూర్ మండలంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురికి ఏడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ బుధవారం రెండో అదనపు జ్యుడీషీయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జావీద్పాష తీర్పు చెప్పారు. మాక్లూర్‌లోని అమీనాబేగం ఇంట్లో ఏడాదిక్రితం మాణిక్భండార్కు చెందిన దండ్లబాబు, మెట్కర్ లక్ష్మణ్, వికాస్‌లు చోరీ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈకేసు బుధవారం జడ్జి విచారించి నేరం రుజువు కావడంతో ముగ్గురికి ఏడు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.