రెండేళ్ల కొడుకు చేతిలో తల్లి హతం!
రెండేళ్ల వయసున్న కొడుకు పొరపాటున తన తల్లిని కాల్చిచంపేశాడు. ఈ ఘటన అమెరికాలోని వాల్ మార్ట్ మాల్లో జరిగింది. 29 ఏళ్ల మహిళ తన కొడుకు, మరో ముగ్గురు పిల్లలతో కలిసి షాపింగ్ చేస్తోంది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ఉండటంతో ఓ స్మాల్ క్యాలిబర్ హేండ్ గన్ తన పర్సులో పెట్టుకుంది. ఆ పర్సును ఆమె తన షాపింగ్ ట్రాలీలో పెట్టుకుని వెళ్తుండగా.. ఆ రెండేళ్ల కొడుకు కూడా అదే ట్రాలీలో ఉన్నాడు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున ఆ హేండ్ గన్ నొక్కాడు. దాంతో తుపాకి పేలి.. నేరుగా ఆ ట్రాలీని తోసుకెళ్తున్న తల్లికి తగిలింది. ఉదయం 10.20 గంటలకు ఈ ఘటన జరిగే సమయానికి ఆమె భర్త ఆ మాల్ పరిసరాల్లో లేడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటి తర్వాత వచ్చిన అతడు.. మిగిలిన పిల్లలను బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఇది చాలా బాధాకరమన ఘటన అని వాల్ మార్ట్ ప్రతినిధి బ్రూక్ బుచానన్ అన్నారు.
ఇంతకుముందు పొరుగునుండే వాషింగ్టన్ రాష్ట్రంలో గత నవంబర్ నెలలో నాలుగేళ్ల అబ్బాయి మూడేళ్ల మరో కుర్రాడిని ఆడుకుంటూ పొరపాటున కాల్చేశాడు. అలాగే ఏప్రిల్లో కూడా ఫిలడెల్ఫియాలో రెండేళ్ల అబ్బాయి తన 11 ఏళ్ల అక్కను ఆడుకుంటూ తుపాకితో కాల్చి చంపేశాడు.