Motor Vehicle law
-
డ్రైవింగ్ లైసెన్స్ లేదనడానికి ఫొటోలే సాక్ష్యమా?
సాక్షి, అమరావతి: డ్రైవింగ్ లైసెన్స్ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది. మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్ చేసి చలాన్ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్ పెట్టుకోలేదని, సెల్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ డ్రైవింగ్ లైసెన్స్ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్ చేస్తూ చలాన్ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. -
వాహనదారులకు శుభవార్త
భువనేశ్వర్: వాహన కొనుగోలుదార్లుపట్ల రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ఈ సందర్భంగా విధించే పన్నును కుదించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి మీడియాకు క్యాబినెట్ సమావేశం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు. వాహనాల కొనుగోలును పురస్కరించుకుని 5 అంచెల్లో వసూలు చేస్తున్న పన్నును 3 అంచెలకు కుదించారు. ఈ నేపథ్యంలో ఒడిశా మోటారు వాహన చట్టం–1975 సవరణకు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించింది. వాహన కొనుగోలు ధరల ఆధారంగా పన్ను విధిస్తారు. రూ.5 లక్షల లోపు విలువైన వాహనం కొనుగోలుపై 6 శాతం పన్ను విధిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య విలువ చేసే వాహనాల కొనుగోలుపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు పైబడి విలువ చేసే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం పన్ను వడ్డిస్తుంది. అద్దె వసూలులో సంస్కరణ సాంకేతిక సమాచారం, స్టార్టప్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్దె వసతుల్ని కల్పిస్తుంది. సబ్సిడీ ధరలతో అద్దె వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో 6 భవనాలు ఈ మేరకు అందుబాటులో ఉన్నట్లు క్యాబినెట్ తెలిపింది. ప్రతి చదరపు అడుగుకు రూ.20 చొప్పున అద్దె వసూలు చేస్తారు. కార్మిక సంస్కరణలు రాష్ట్రంలో కార్మిక సంస్కరణలపట్ల క్యాబినెట్ దృష్టి సారించింది. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున కార్మిక అధికారుల్ని నియమించేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 314 సమితులు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్లు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో అదనంగా కార్మిక అధికారులు పని చేస్తారని క్యాబినెట్ తెలిపింది. ఇలా 11 ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించినట్లు ప్రదాన కార్యదర్శి వివరించారు. -
‘మొదటి’కే మోసం...
♦ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ♦ పేర్ల నమోదులో లోపించిన శాస్త్రీయత ♦ ఏ రెండు పేర్లు కలిసినా తప్పని ఇబ్బందులు ♦ ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్టీఏ అధికారులు ♦ ‘సాంకేతిక వైఫల్యం’ సాకు.. సాక్షి,సిటీబ్యూరో : రాంనగర్‌కు చెందిన కల్లూరి వసంత... తాను కొత్తగా కొనుగోలు చేసిన మారుతి స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఆమె పేరిట ఒక ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉందని, తాజాగా రెండో వాహనం (కారు) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు శాతం జీవితకాల పన్ను అదనంగా చెల్లించాలని అధికారులు సెలవిచ్చారు. దాంతో ఆమె విస్మయానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయలేదని, ఇదే మొట్టమొదటి వాహనమని చెప్పారు. కానీ ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. గతంలో తనకు ఎలాంటి వాహనాలు లేవని స్వతహాగా నిరూపించుకొంటే తప్ప అదనపు పన్ను రద్దు చేయబోమన్నారు. ఇంకేముంది. 2 నెలల పాటు నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వడపోసి బహదూర్‌పురాకు చెందిన తన లాంటి పేరే ఉన్న మరో మహిళ కు హోండా యాక్టివా ఉన్నట్లు నిరూపించారు. అలా ఆమె ఎంతో సంతోషంగా కొనుక్కొన్న కారు రిజిస్ట్రేషన్ కావడానికి ఏకంగా 2 నెలలు పట్టింది. ఇది ఒక్క వసంత సమస్య కాదు. నగరంలోని వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య.కంఫ్యూటర్లో వాహనదారుల వివరాలను నమోదు చేయడంలోని అశాస్త్రీయత, అసమగ్రత, సాంకేతిక లోపాల కారణంగా ఒకే తరహా ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు ఉన్న వాహనదారుల పాలిట ‘ సెకెండ్ వెహికిల్’ ఒక వేధింపుగా మారింది. ఎందుకిలా... మోటారు వాహన చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే రెండో వాహనం ఖరీదులో ద్విచక్రవాహనం అయితే 5 శాతం, కారు అయితే 2 శాతం చొప్పున జీవితకాలపన్ను చెల్లించాలి. కానీ కొంతమందికి మొదటి వెహికిల్ లేకపోయినప్పటికీ కొత్తగా కొనుగోలు చేసిన దాన్ని సెకెండ్ వెిహ కిల్‌గా పరిగణించి పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లో నమోదైన వివరాలను ఆధారంగా చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1500 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే, వాటిలో 25 శాతం వాహనాలపై వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి 2013 వరకు దశలవారీగా ప్రవేశపెట్టిన త్రీటైర్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తలెత్తిన దుష్ఫలితం ఇది. టూటైర్ సాంకేతిక పరిజ్ఞానం నుంచి టూటైర్లోకి మారుతున్న దశలో వాహనాల వివరాలను శాస్త్రీయంగా న మోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఒకే పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనాల రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఆనంద్‌నగర్‌కు చెందిన ఒక వాహనదారుడు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్‌కు వెళ్లాడు. అప్పటికే ఒక వాహనం అతని పేరిట ఉన్నట్లు అధికారులు యదావిధిగా చెప్పారు. నల్గొండలోని రామన్నపేటకు చెందిన తన ఇంటిపేరే కలిగిన మరో వ్యక్తి వివరాలను సేకరించి తెస్తే తప్ప అధికారులు అతని వాహనం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏజెంట్లు, దళారులను ఆశ్రయించి వచ్చే వారికి మాత్రం మినహాయింపు లభించడం కొసమెరుపు... -
జీవ ఇంధన వాహనాలకు ప్రోత్సాహం: గడ్కారీ
న్యూఢిల్లీ: దేశంలో జీవఇంధనాల(బయో ఫ్యూయల్)తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి మోటారు వాహనాల చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ప్రమాణాలు ఉండేలా నిబంధనలను రూపొందించనున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సంబంధిత బిల్లును ప్రవేశపెడతామన్నారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. సాంప్రదాయేతర ఇంధనాలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.