MPTC ZPTC elections
-
యువతరం చేతికి గ్రామ నాయకత్వం
సాక్షి, అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో ఏప్రిల్ నుంచి తిరిగి సర్పంచుల పాలన మొదలైంది. 1,30,966 మంది వార్డు సభ్యులుగా, 13,097 మంది సర్పంచులుగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. ఈ ఏడాదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. 9,675 మంది ఎంపీటీసీలు, 650 జెడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మందికి పైగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. వీరిలో 85 శాతం మంది యువ నాయకత్వమే కావడం గమనార్హం. ఇదే సమయంలో గ్రామీణ పాలనలో ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా గ్రామాల్లో గ్రామ కంఠంగా వర్గీకరించిన ప్రాంతంలో ఇళ్లకు తొలిసారి అధికారిక యాజమాన్య పత్రాల జారీ ప్రక్రియను చేపట్టింది. గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా జిల్లా పరిషత్లలోనూ రెండో డిప్యూటీ చైర్మన్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవులను కొత్తగా సృష్టించి పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే జెడ్పీలో రెండో డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ముగియగా.. మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
-
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిలు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని తెలిపారు. రూ.లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ జమ చేశారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాదరణతో వైఎస్సార్సీపీ మెజారిటీ గతానికంటే పెరుగుతోందన్నారు. ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఓటమిని ముందే పసిగట్టి బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ 65 స్థానాలకి ఎన్నిక జరిగితే 63 స్థానాల్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఆరుకి ఆరు జడ్పీటీసీలూ కైవసం చేసుకొన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల్లో ఓట్ల శాతం పెరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకీ ప్రజాదరణ పెరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం వల్లే జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి రాష్ట్రంలో తిరుగులేదని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. -
ప్రజాభిమానానికి అధికార ముద్ర
పని చేస్తే ఫలితం దక్కుతుంది; ప్రజలు మెచ్చితే అన్ని కుట్రలూ వీగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెల్లడైన సరళమైన సత్యం ఇది. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు జనం బ్రహ్మరథం పట్టడం దాన్నే తెలియజేస్తోంది. ఈ ఎన్నికలు చాలా కారణాల వల్ల చరిత్ర. జరగాల్సినవి జరగక పోవడం, జరగాల్సిన సమయంలో జరగకపోవడం, జరిగినట్టే జరిగి ఆగిపోవడం, జరిగినా వెంటే ఫలితాలు తెలియకపోవడం... ఎన్నికల చరిత్రలో ఇవి చెరిగిపోవాల్సిన పేజీలు. ఇన్ని జరిగినా నాలుగు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ గెలవడం సువర్ణాక్షరాలతో రాయాల్సిన పుట. ఇది ప్రజాభిమానం వల్లే సాధ్యమైంది. చేస్తున్న పాలనకు వారి అధికార ముద్ర పడ్డందువల్లే సంభవమైంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, విభజిత ఏపీలో గానీ ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల అన్నిటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది అధికార దుర్వినియోగంతోనో, మరో అక్రమంతోనో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వచ్చాయి. దానర్థం ఏమిటి? ఆయా చోట్ల అధికార పార్టీ ఏమైనా గొడవలు చేస్తే ఎదుర్కొనేవారు గణనీయంగానే ఉన్నా రన్నమాట. దానికి తోడు ఆయా వ్యవస్థల అండ ఎటూ ఉంది. అలాంటిది స్థానిక ఎన్నికలలో నిజంగా తెలుగుదేశంకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఊరుకుంటుందా? టీడీపీ ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఒక పక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్క రించామని చెబుతూనే, వివిధ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్య ర్థులకు బీఫారాలు ఇచ్చారు. 8 వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ గెలిస్తే, 9 వందలకు పైగా టీడీపీ గెలిచింది. మరి పోటీలో ఉన్నట్లా, లేనట్లా? నామినేషన్లు వేసిన తర్వాత చాలాకాలం ఎన్నికలు జరగకుండా చేయడంలో టీడీపీ సఫలమైంది. ఏడాదిన్నరపాటు ఎన్నికల ప్రక్రియ నడిచిన సందర్భం దేశంలో ఇదొక్కటే కావచ్చు. కరోనా కేసులు లేన ప్పుడు ఎన్నికలను వాయిదా వేయించింది. ఆ తర్వాత కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో జడ్పీ, మండల ఎన్నికలను పక్కనబెట్టి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా పథకం అమలు చేయిం చింది. ఈ ఎన్నికలలో పూర్తిగా పరాజయం చెందడంతో కొత్త వ్యూహంలోకి వెళ్లారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపకుండా ఆపు చేయించారు. చాలా చిత్రంగా నామినేషన్లు పూర్తయిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించకపోవడం కూడా ఒక చరిత్రే. స్థానిక ఎన్నికలపై ఎవరైనా పరిశోధన చేయదలిస్తే, ఇవన్నీ ఆసక్తికర అధ్య యన అంశాలు అవుతాయి. మధ్యలో ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ చాలా దారుణ మైన లేఖను కేంద్రానికి రాయడం జరిగింది. నిజానికి ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని ఎక్కువ మంది నమ్మకం. మొదట ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కేసును సీఐడీ టేకప్ చేయడంతో టీడీపీని రక్షించడం కోసం తానే రాశానని చెప్పు కోవలసి వచ్చింది. అలాగే ఈ ఎన్నికలపై కోర్టులలో పడినన్ని వ్యాజ్యాలు బహుశా మరే ఎన్నికలపై పడి ఉండకపోవచ్చు. సింగిల్ బెంచ్ జడ్జీ ఎన్నికలు నిర్వహించవద్దని అనడం, డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అయినా మళ్లీ సింగిల్ జడ్జీ ఈసారి ఎన్నికలనే రద్దు చేయడం, తిరిగి అప్పీల్లో డివిజన్ బెంచ్ నాలుగు న్నర నెలల సమయం తీసుకుని ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు జాప్యం అయితే న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలిస్తుంటాయి. ఈసారి మాత్రం న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఎన్నికలు జాప్యం అవడం మరో చిత్రం అని చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కోడ్ అమలు చేసి, జడ్పీ, మండల ఎన్నికలకు అది వర్తింపచేయకుండా కోడ్ ఎత్తివేసి నిమ్మగడ్డ ఈ ఎన్నికలను వాయిదా వేయడమే కుట్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని లిటిగేషన్‌గా మార్చాయి టీడీపీ, జనసేన. ఒక పక్క తాము ఎన్నికలను బహిష్కరించామని చెబుతూనే మరో పక్క ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఆశ్చర్యమే. నలభై శాతం ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాడి వదలివేయడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బలహీనవర్గాలకు చేరాయి. కులం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు దక్కాయి. దాంతో టీడీపీకి చెందినవారు కూడా వైసీపీ వైపు మొగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ లేకుంటే చంద్రబాబుకు కంచుకోట వంటి కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, తొంభై శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి ఎలా వస్తాయి? ఇది కచ్చితంగా చంద్రబాబుకు అప్రతిష్టే. ఈ 32 ఏళ్లలో కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ గెలవ లేదు. గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. పంచాయతీ ఎన్నికలలోనే వైసీపీ గెలుపుతో బిత్తరపోయిన చంద్ర బాబు, తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అయినా జడ్పీ, మండల ఎన్నికలలో ఫలితం దక్కకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో టీడీపీ గెలిస్తే మీడియాలో అది పెద్ద వార్తగా ప్రచారం అయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆ స్థానం వైసీపీకి దక్కింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు స్వగ్రామం నిమ్మకూరును టీడీపీకి బలమైన గ్రామంగా భావి స్తారు. అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇలాకాతో సహా అనేక చోట్ల టీడీపీకి ఒకటి, అరా తప్ప సీట్లు రాలేదు. గత నాలుగు దశాబ్దాలలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి విజయం నమోదు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికలలో అధికార టీడీపీ పది జడ్పీలను మాత్రమే గెలుచుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ పదింటిని, టీఆర్ఎస్ రెండింటిని కైవసం చేసుకుంది. మండలాల ఎన్నికలలో టీడీపీకి 482 దక్కితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 430, టీఆర్ఎస్కు 83 వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 19 జడ్పీలు, టీడీపీకి రెండు, టీఆర్ఎస్కు ఒకటి వచ్చాయి. మండల ఎన్నికలలో కాంగ్రెస్‌కు 620, టీడీపీకి 355, ఇతర పార్టీలు 45 గెలుచుకున్నాయి. అంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. 2014లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలిగినా, వైసీపీ తన పట్టును గట్టిగానే ఉంచుకోగలిగింది. టీడీపీకి 372 జడ్పీటీసీలలో తొమ్మిది జడ్పీలు, వైసీపీ 271 జడ్పీటీసీ లతో మూడు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. మండల పరిషత్‌లలో టీడీపీకి 386 వస్తే, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 205 వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ వైసీపీనే విజయం సాధించింది. 83 శాతం డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటే, 11 శాతం డివిజన్లే టీడీపీకి వచ్చాయి.75 మున్సిపాలిటీలకు గానూ 74 వైసీపీ ఖాతాలో జమ య్యాయి. తాజాగా వెల్లడైన జడ్పీ, మండల ఎన్నికల ఫలితాలలో తొంభై శాతంపైగా వైసీపీకి రావడం టీడీపీకి జీర్ణం కాని విషయమే. ఇవన్నీ రికార్డులే. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి కొంత మొగ్గుంటుంది. ఒక్క 2014లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్ల పూర్తిగా నష్టపోయింది. అది వేరే విషయం. కానీ ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే– ఎనభై, తొంభై శాతం ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా రావడం; ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం. ఇదే సమయంలో ఒక విషయం కూడా హెచ్చరించాలి. స్థానిక ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ముందంజలోనే ఉన్నా, వచ్చే రెండున్నరేళ్లు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవలసి ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా చిలవలు పలవలు చేయగల సత్తా టీడీపీకి, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాకు ఉంది. తిమ్మిని బమ్మిగా చేయగల నేర్పరులు వారు. తస్మాత్ జాగ్రత్త! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు -
సందడే సందడి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కన్పించింది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పార్టీ విజయదుందుభి మోగించటంతో కార్యకర్తలు, నేతల్లో అభిమానం ఉప్పొంగింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం నుంచే నింగినంటేలా సంబరాలకు తెరతీశారు. కౌంటింగ్ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు సందడి చేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాల్లోనే కాకుండా చిన్నచిన్న పల్లెల్లోనూ పెద్దఎత్తున విజయోత్సవాలు జరిగాయి. డప్పు నృత్యాల మధ్య పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. పార్టీ శ్రేణులు వాడవాడలా మిఠాయిలు పంచుకున్నారు. అతితక్కువ కాలంలోనే పెద్దఎత్తున అమలైన సంక్షేమ ఫలాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. అన్ని జిల్లాల్లోని వైఎస్సార్సీపీ శిబిరాలు ఇలా ఆనందోత్సాహాలతో కళకళలాడితే అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయాలు మాత్రం వెలవెలబోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు కరువయ్యారు. అన్నిచోట్లా నిశ్శబ్ద వాతావరణం తాండవించింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రోజంతా సందడే కన్పించింది. ఉ.11 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెద్దఎత్తున్న బాణసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్ నేతలు ధన్యవాదాలు చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట బాణసంచా కాలుస్తున్న పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రజా విజయమని కొనియాడారు. సీఎం జగన్ స్వచ్ఛమైన పాలనను కాంక్షిస్తూ ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. అనంతరం ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గడువు ముగిసినా.. గెలవలేమని భావించే చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎన్నికలు పెట్టాలని కృషిచేసినా.. చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. బాబు, లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను తాము బహిష్కరించాం అని మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు సిగ్గులేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాల్లో మార్పేమీ లేదని గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు టీడీపీ మొత్తం రాజీనామా చేసినా.. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం జగన్ జనరంజక పాలనకు ఈ ఫలితాలు చక్కని నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని మరో ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ధీమా వ్యక్తంచేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైఎస్సార్సీపీ నేతలు బల్లి శ్వేత, చల్లా మధు, ఎన్ఆర్ఐ రత్నాకర్, జూపూడి ప్రభాకర్‌రావు, ఎ. నారాయణమూర్తి, ఈద రాజశేఖర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
గ్రహణం వీడింది: సజ్జల
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తాజాగా హైకోర్టు ఆదేశాలతో దీర్ఘకాలంగా ప్రజా తీర్పునకు పట్టిన గ్రహణం వీడినట్లయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో సర్పంచ్ ఎన్నికలు, 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా గత సర్కార్ నిర్వహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాక టీడీపీ కార్యాలయం సూచనల మేరకే 2020 మార్చి 15న నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేశారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు రోజుల ముందు కరోనా ప్రభావం లేకున్నా నిమ్మగడ్డ కావాలనే వాయిదా వేసినట్టు తెలిపారు. అజెండాలో లేకున్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను ముందుకు తెచ్చి టీడీపీపై కృతజ్ఞత చాటుకుని నిమ్మగడ్డ పదవీ విరమణ చేసి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబే దోషి.. ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలన్నింటికీ చంద్రబాబే దోషి అని సజ్జల స్పష్టం చేశారు. వ్యవస్థల్లో సాంకేతిక లొసుగులను అడ్డు పెట్టుకుని పార్టీ నేతలతో పిటిషన్లు దాఖలు చేయించడం వల్ల ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగిందన్నారు. దాదాపు 6 నెలలపాటు ఓట్ల లెక్కింపు జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. విజ్ఞులు, సామాజికవేత్తలు, మేధావులు ఈ అంశంపై ఆలోచించాలని కోరారు.ఎన్నికల ప్రక్రియను ఏళ్ల తరబడి ఆపగలగడాన్ని అంగీకరించాలా? అని ప్రశ్నించారు. దిశ బిల్లు ప్రతులను లోకేశ్ తగలబెట్టడం ఆయన మానసిక స్థితికి నిదర్శమన్నారు. పింఛన్లపై దుష్ప్రచారం పేదరిక నిర్మూలనకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి, బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి, బోయ కులస్తుల ఆత్మీయ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా సీఎం జగన్ ఆ సంఖ్యను 60 లక్షలకు పెంచారని చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండూ ఓసీలకు రిజర్వ్ అయిన మండలాల్లో ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు. బీసీలు ఇతర కులాలకు కూడా నాయకత్వం వహించేలా సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సజ్జల సూచించారు. సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే ఆనాడు వాల్మీకి రామాయణాన్ని రచిస్తే, సీఎం జగన్ పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బోయ, వాల్మీకి కులానికి చేసిన వాగ్దానాలను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి సీఎం జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. బీసీ కులాల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు నెలలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాల్మీకిలు బీసీలుగా మరికొన్ని చోట్ల ఎస్టీలుగా ఉన్నారని, దీన్ని సరి దిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సమావేశంలో నవరత్నాలు నారాయణమూర్తి, వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. -
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య! సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్‌కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదికిపైగా ఎన్నికల ప్రక్రియ.. వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో ఆ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలోనే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నా నిమ్మగడ్డ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్న ఆరోపణలున్నాయి. నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 8వతేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు వెలువరించింది. గెలిచినా ఏడాదిగా నిరీక్షణ.. 2020 మార్చిలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. హైకోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యధాతథంగానే కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలోనే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పరిషత్ ఫలితాలతో లింక్ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాలవారీగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మండలిలో అధికార వైఎస్సార్సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విజయనగరం జిల్లాలోని కొటియా గ్రామాలలో ఉద్రిక్తత
-
ఊపందుకున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
నెల్లూరు జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
చిత్తూర్ జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
కర్నూల్ జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
విజయవాడ లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
తూర్పు గోదావరి జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
విజయనగరం జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
ప్రకాశం జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది
-
ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలు
-
వీరంగం సృష్టించిన టీడీపీ అభ్యర్థి
-
వైఎస్సార్సీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకుగాను 86 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (చదవండి: వలసలతో టీడీపీ కుదేలు..) చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం 4 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతోపాటు చిత్తూరు జిల్లాలోని 65 జడ్పీటీసీలకుగాను 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మొత్తంలో 858 ఎంపీటీసీలకుగాను 225 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్న ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే! (చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు.. నెల్లూరు: 46 జడ్పీటీసీలకుగాను 12చోట్ల ఏకగ్రీవం. గుంటూరు: జిల్లాలో ఉన్న 54 జడ్పీటీసీలకుగాను 8చోట్ల ఏకగ్రీవం, మాచర్ల నియోజకవర్గంలో 70 చోట్ల ఏకగ్రీవం. వైఎస్సార్ కడప: 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల ఏకగ్రీవం. జడ్పీ చైర్మన్‌ను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ. కృష్ణా: మండవల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయనిర్మల ఏకగ్రీవం, గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవం. పశ్చిమగోదావరి: ఏలూరు రూరల్ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సరస్వతి ఏకగ్రీవం, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి బాబ్జి ఏకగ్రీవం. కర్నూలు: 53 జడ్పీటీసీలకుగాను 14చోట్ల ఏకగ్రీవం, 805 ఎంపీటీసీలకుగాను 150చోట్ల ఏకగ్రీవం. ప్రకాశం: 55 జడ్పీటీసీలకుగాను 11చోట్ల ఏకగ్రీవం. శ్రీకాకుళం: 667 ఎంపీటీసీలకుగాను 48చోట్ల ఏకగ్రీవం. టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకట్రావ్ సొంత మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, 12 ఎంపీటీసీలకుగాను 12 చోట్లా ఏకగ్రీవం. విజయనగరం: 34 జడ్పీటీసీలకుగాను 3చోట్ల ఏకగ్రీవం, 549 ఎంపీటీసీలకుగాను 25 చోట్ల ఏకగ్రీవం. విశాఖపట్నం: 39 జడ్పీటీసీలకుగాను ఒకచోట ఏకగ్రీవం. 651 ఎంపీటీసీలకుగాను 20 చోట్ల ఏకగ్రీవం. తూర్పుగోదావరి: 1086 ఎంపీటీసీలకుగాను 30చోట్ల ఏకగ్రీవం. అనంతపురం: 841 ఎంపీటీసీలకుగాను 41చోట్ల ఏకగ్రీవం. -
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక ్స్ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూత్ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు. పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు.