Mr. World
-
మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ
-
మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ
- పురుషుల మోడలింగ్ ప్రపంచంలో భారత్‌కు తొలి టైటిల్ - ఫైనల్లో 46 మందితో పోటీలో నెగ్గిన రోహిత్ - భారతీయుల అభిమానమే గెలిపించింది..: రోహిత్ సాక్షి, హైదరాబాద్: మిస్టర్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు.. అదీ మన హైదరాబాదీ విజేతగా నిలిచాడు. మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో 46 దేశాలకు చెందిన ఫైనలిస్ట్‌లతో పోటీపడి.. రోహిత్ ఖండేల్వాల్ (26) మిస్టర్ వరల్డ్-2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల మోడలింగ్ ప్రపంచంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కిన మిస్టర్ వరల్డ్ టైటిల్ ఇదే కావడం విశేషం. అవార్డుతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి రోహిత్ అందుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2014 టైటిల్ విజేత నిక్లస్ పెడెర్సన్.. రోహిత్‌కు టైటిల్‌ను అందజేశారు. ప్యూర్టో రికోకు చెందిన ఫెర్నాండో అల్వరేజ్ (21), మెక్సికోకు చెందిన ఎస్పార్జా రామిరెజ్ (26) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. రో‘హిట్’ జర్నీ సాగిందిలా.. హైదరాబాద్‌లోని అరోరా డిగ్రీ కాలేజీలో రోహిత్ చదువుకున్నాడు. తండ్రి రాజ్‌కుమార్ ఖండేల్వాల్. ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలంటే పిచ్చి. డిగ్రీ పూర్తి చేశాక స్పైస్‌జెట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌లో పనిచేసి, అనంతరం డెల్ కంప్యూటర్స్‌లో టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్‌గా చేశాడు. రెండేళ్ల క్రితం ఎంబీఏ చేయడానికి ముంబై వెళ్లాడు. అప్పు డే మోడలింగ్ రంగానికి చేరువయ్యాడు. ఇందుకోసం 85 కిలోలకు పైగా బరువు నుంచి ఆర్నెల్ల్లలోనే 15 కిలోలు తగ్గాడు. టీవీ కమర్షియల్స్, యాడ్స్, ర్యాంప్ షోలతో మోడలింగ్ కెరీర్ ప్రారంభించి తలుపు తట్టిన ప్రతి అవకాశాన్ని అందుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగా నుక్తాంగన్ చైల్డ్ ఎంపవర్మెంట్, బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్.. తదితర సంస్థలతో పనిచేశాడు.పర్సనాల్టీ డెవలప్మెంట్ సెషన్స్ నిర్వహించాడు. వి చానల్ తదితర టీవీ కార్యక్రమాలు చేశాడు. బాలీవుడ్లో యే హై ఆషికిలో చేసిన వీర్ పాత్ర, ప్యార్తునే క్యా కియాలో చేసిన శ్రీధర్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిస్టర్ ఇండియా యాడ్ చూసి ఆడిషన్స్‌కి వెళ్లి, ప్రిపరేషన్స్‌కి ఒక్క నెల మాత్రమే ఉన్నా.. అప్పటికప్పుడు టాలెంట్ రౌండ్ కోసం ఫ్రెండ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుని.. గ్రౌండ్లో 20 లీటర్ల వాటర్ క్యాన్ మోస్తూ 20 రౌండ్లు కొట్టడం వంటి కఠినమైన వర్కవుట్స్ చేశాడు. మిస్టర్ ఇండియా టైటిల్‌తో పాటు మిస్టర్ యాక్టివ్, బెస్ట్ యాక్టర్, మిస్టర్ ఫొటోజెనిక్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో మిస్టర్ వరల్డ్ టైటిల్‌కు గురిపెట్టాడు. జూలై 17 నుం చి 19 వరకు సౌత్ లండన్‌లో జరిగిన పోటీ లో రాణించి భారత్‌కు పురుషుల గ్లామర్ ప్రపంచంలో ఫస్ట్ టైటిల్‌ను అందించాడు. నమ్మలేకపోతున్నా: రోహిత్ ‘మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలవడం ఇంకా నమ్మలేకపోతున్నాను. చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సహించిన మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులు మద్దతుతోనే ఇది సాధ్యమైంది’ అని రోహిత్ అన్నాడు. భారతీయులు చూపించిన అభిమానమే తనను టైటిల్ గెలిచేలా చేసిందని చెప్పాడు. కాగా, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు, మిస్టర్ వరల్డ్ టాలెంట్, మోబ్స్టార్ పీపుల్స్ చాయిస్ అవార్డ్స్, మిస్టర్ వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ల్లోనూ పాల్గొన్న రోహిత్.. మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డును గెలుచుకున్నాడు. -
ప్రపంచానికి జబ్బు చేసింది...
స్మరణీయులు / శారద మిస్టర్ ప్రపంచంగార్కి మళ్లీ జబ్బు చేసింది. మంచాన పడ్డాడు. మిస్టర్ సామ్రాజ్యవాదం వెంటనే సర్ బూర్జువాకి కబురు చేశాడు. ఆయన కారేసుకు దిగాడు. సామ్రాజ్యవాదం ఆయనను చూడగానే ‘సర్ బూర్జువా. మిస్టర్ ప్రపంచం గార్కి మళ్లీ జబ్బు చేసింది. ఇదేం జబ్బో తేలాలి. డాక్టర్ని పిలవండి’ అన్నాడు. ‘ఎవర్ని పిలిచేది’ అని అడిగాడు బూర్జువా. సామ్రాజ్యవాదంగారు బాగా ఆలోచించి ‘డా.సామ్యవాదంగారు ఉన్నాడే. ఆయన్నే పిలు’ అన్నాడు. సర్ బూర్జువా కళ్లజోడు తుడిచి తగిలించుకొని ‘వాడా. ఛా..ఛా. వాడు ప్రతిదానికీ సోషలిజం ఇంజెక్షన్లు, రివల్యూషను సొల్యూషన్లూ ఇస్తానంటాడు’ అన్నాడు. మిస్టర్ సామ్రాజ్యవాదం వినకుండా ‘వాడికి మిస్టర్ ప్రపంచంగారి తత్వం తెలుసు. పిలవండి. మందివ్వడానికి కాదు. రోగం ఏమిటో నిఖరంగా తేలడానికే’ అన్నాడు. బూర్జువా వెంటనే డాక్టర్ సామ్యవాదికి ఫోన్ చేశాడు. ఆయన అర్జెంటుగా వచ్చేశాడు. బూర్జువా గారూ, సామ్రాజ్యవాదం గారూ ఆయనకు మిస్టర్ ప్రపంచాన్ని చూపి జబ్బేమిటో తేల్చమన్నారు. ఆయన చేయి పట్టుకొని చూసి ‘ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీని పేరు బానిసరోగం. దీనికల్లా ముందుగా రెవల్యూషన్ మందు ఘాటుగా తగలాలి. తర్వాత సోషలిజం ఇంజెక్షనులు నరాలలో ఎక్కించాలి. అప్పుడుగాని నయంగాదు’ అన్నాడు. ఇద్దరు పెద్దలూ ఉలిక్కిపడి ‘మిమ్మల్ని మందులు చెప్పమన్నామా? రోగం ఏమిటో తేల్చమన్నాంగాని. ఇదిగో ఈ డాలర్ ఫీజు పుచ్చుకుని దయచెయ్యండి’ అన్నారు. డాక్టరు సామ్యవాది వెళ్లిపోయాడు. సామ్యవాది గడపదాటిన దగ్గర నుంచీ మిస్టర్ ప్రపంచంగార్కి రోగం ఎక్కువైంది. మంచం మీది నుంచి ఎగిరెగిరి పడుతున్నాడు. సంధిలోకి దిగింది వ్యవహారం. సామ్రాజ్యవాదంగారు, బూర్జువాగారు మిస్టర్ ప్రపంచాన్ని మంచానికి కట్టేసి ఆలోచించారు. ఇక ఇది నయమయేదెట్లా? సర్ బూర్జువా చెప్పాడు- ‘ఉన్నాడు గదటయ్యా మన రావ్‌బహదూర్ సర్ మతవాది. ఆయనైతే ఈ పాడు విజాతీయ మందులు గాకుండా అచ్చం స్వజాతి గుళికలు, తైలాలు వేసి నయం చేస్తాడు. ఆయన్ని కబురు చేస్తున్నాను’ అని ఫోన్ చేశాడు. రావ్ బహుదూర్ సర్ మతవాది స్వంత విమానం మీద ఎక్కి వచ్చినాడు. ప్రపంచంగారి చెయ్యి చూచాడు. ‘దైవము కృపయుంచుగాక.మిస్టర్సూ... ఈ మిస్టర్ ప్రపంచానికి నాస్తిక టైఫాయిడ్ జ్వరం వంటబట్టింది. అంచేతనే ఇట్టా ఎగిరెగిరి పడ్తున్నాడు. ఇది నయమయే జబ్బు గాదు. అయినా నిద్ర పట్టేందుకు ఒక మిశ్రీత రసాయనం ఇస్తున్నాను’ అని రెండౌన్సులు వేదాంతం, రెండు గ్రాముల దైవభక్తి, మూడౌన్సులు అహింస కలిపి ఇచ్చాడు. సర్ బూర్జువా అన్నాడు- ‘మరేనండి. నిద్ర పోయినా నయమే. మేలుకొని ఉండి మరీ వేపుక తింటున్నాడు’. శారద (1924-1955) తెలుగువారికి పట్టని ఒక మహా రచయిత. తమిళ దేశం నుంచి తెలుగు ప్రాంతానికి వచ్చి, తెనాలిలో స్థిరపడి, తెలుగు అక్షరాలను కూడబలుక్కుని చదువుతూ నేర్చుకొని, తినడానికి తిండి లేకపోయినా పుస్తకాలనూ ప్రపంచ సాహిత్యాన్ని నమిలి భుజించి, తద్వారా నరాల జబ్బు తెచ్చుకొని, కడు దారిద్య్రంలో జీవిస్తున్నా ఈ నిస్సహాయ జనం చేతికి చైతన్యవంతమైన రచన అనే ఆయుధాన్ని ఇవ్వాలని తపించి, లెక్కకు మించి రచనలు చేసి, చేస్తూ చేస్తూనే అతి చిన్న వయసులో కన్నుమూసిన కలంవీరుడు, తిరుగుబాటుదారుడు శారద. అసలు పేరు ఎస్.ఎస్.నటరాజన్. జూలై 14, 1946లో అతడు రాసిన తొలి కథ, అతి చిన్న కథ, అతి శక్తిమంతమైన కథ ఎలా ఉందో చూడండి.