mulugu ramalingeswara varaprasad
-
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
కాచిగూడ (హైదరాబాద్)/పాత గుంటూరు: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్త, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి (70) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో ప్రజలకు జ్యోతిషం చెబుతుండగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రామలింగేశ్వర సిద్ధాంతి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. సిద్ధాంతి పార్ధివ దేహాన్ని హిమాయత్‌నగర్‌లోని కుమార్తె ఇంటివద్ద బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట రేస్‌కోర్సు వెనుక ఉన్న హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన బంధుమిత్రులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. లక్షలాది మందికి మార్గదర్శనం రామలింగేశ్వర సిద్ధాంతి జ్యోతిషం చెబుతూ, పంచాంగం ద్వారా దాదాపు 4 దశాబ్దాలకు పైగా లక్షలాది మందికి మార్గదర్శనం చేశారు. ఏపీలోని గుంటూరు పండరీపురానికి చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ములుగు నాగలింగయ్యకు వారసుడిగా ఆయన చెప్పిన 95 శాతం అంచనాలు నిజమయ్యాయని చెబుతారు. 14 సంవత్సరాల నుంచి ఆయన అంచనాలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి వచ్చే వారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులయ్యారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించారు. ప్రతి సంవత్సరం పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నారని చానెల్ నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలో ఆయుష్య హోమాలు నిర్వహించారు. టీవీలో వారఫలాలు చెబుతూ ఎంతో మందికి చేరువయ్యారు. ఈయన చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లోని తెలుగువారూ ఎంతగానో విశ్వసిస్తుంటారు. 15 ఏళ్లుగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పంచాంగం అందిస్తున్నారు. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తున్నారు. మిమిక్రీలో అంతర్జాతీయ ఖ్యాతి సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఎం.ఆర్.ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆకస్మిక మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాశి ఫలాల ఆధారంగా ఆయన చెప్పే జ్యోతిషానికి మంచి ఆదరణ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
సంక్రాంతి పండుగ ఎప్పుడు?
జనవరి 14వ తేదీ మధ్యాహ్నం సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం సంప్రాప్తించింది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం పదహారు గంటలు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దృక్ సిద్ధాంతం ద్వారా పండుగలు, గ్రహగతుల సంచారం స్పష్టంగా తెలుస్తాయి. సాయన సిద్ధాంతం మనకు వర్తించదు. సూర్యుడు మిగిలిన రాశులలో ప్రవేశించినప్పుడు కూడా పుణ్యకాలాన్ని తెలియజేసినప్పటికీ మకర సంక్రమణానికి ఉన్నంత ఆదరణ మిగిలిన వాటికి లేదు. ఈ మకర సంక్రమణాన్ని అనుసరించే సంక్రాంతి పురుషుని నామం, వాహనం, గొడుగు, వస్త్రధారణ, ఆయుధ ధారణలు తెలియజేయడం జరుగుతుంది. వాటివల్ల కలిగే శుభాశుభ ఫలితాలు తెలియజేయడం ఆచారం. ఈ పండుగలలో వివాదాలు కొత్తగా వచ్చినవేమీ కాదు. గతంలో కృష్ణాపుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా వివాదాస్పదమైనాయి. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా జనవరి 14వ తేదీనే మకర సంక్రాంతి అని స్పష్టంగా తెలియజేయడమైనది. అసలు పండుగలలో వివాదాలు రాకుండా దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ సిద్ధాంతులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి, మెజారిటీ సిద్ధాంతుల అభిప్రాయాలను బట్టి పండుగ తేదీలను ప్రకటిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. సంక్రాంతి పండుగ 14న జరుపుకోవాలా? 15న జరుపుకోవాలా ? అని చాలామందికి సందేహం ఉత్పన్నమవుతున్నది. దానికి కారణం సాంఘిక మాధ్యమాలలో, పలు వార్తా పత్రికలలో వచ్చిన వార్తలు. సూర్యుడు ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సూర్యుడు తేది: 14–01–2018, ఆదివారం మధ్యాహ్నం 01:46 నిమిషాలకు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కావున అదేరోజు అనగా తేది : 14–01–2018 నాడే మకర సంక్రాంతి పండుగను ఆచరించాలి. – స్వామి శాంతానంద పురోహిత్, శక్తి పీఠం వ్యవస్థాపకులు 2018 జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినం అని తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లికి చెందిన పిడపర్తి గంటల పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ పిడపర్తి వీరేశ్వర శాస్త్రి, సోదరులు వారి క్యాలెండర్‌లోనూ, పంచాంగంలోనూ సూచించారు. రాజమహేంద్రవరంలోని కోటగుమ్మంకు చెందిన మోహన్ పబ్లికేషన్స్ వెలువరించిన కాలచక్రం సూర్యసిద్ధాంత పంచాంగం ప్రకారం సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ జనవరి 14ననే మకర సంక్రమణం జరుగుతోందని చెప్పారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞ కూడా జనవరి 14ననే సంక్రాంతి అని పేర్కొన్నారు. – ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి -
ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తోందట. మిగిలిన గ్రహగతులు కూడా రాజకీయ విజయాన్ని సూచించడం లేదని.. అందువల్ల ఈసారి ఎన్నికల్లో విజేత హిల్లరీ క్లింటనే అవుతారని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ జోస్యం చెప్పారు. ట్రంప్, హిల్లరీల పుట్టిన రోజుల ఆధారంగా వాళ్ల జాతకచక్రాలను రూపొందించిన ఆయన.. పలు విషయాలు వెల్లడించారు. ట్రంప్ జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని తెలిపారు. ఇక హిల్లరీ క్లింటన్ది పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదమని, ఆమె కుంభరాశిలో జన్మించారని వివరించారు. ఆమె జన్మలగ్నం తులా లగ్నమని, ప్రస్తుతం రవి మహర్దశలో రాహువు అంతర్దశ నడుస్తోందని తెలిపారు. రవి నీచభంగ రాజయోగంలో ఉన్నాడని, రాహువు ఉచ్చస్థితిలో ఉన్నాడని.. దశమ స్థానంలో శని, కుజులున్నారని చెప్పారు. ఇది చాలా మంచిదని, జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయమని అన్నారు. తొలిసారిగా ఒక మహిళ అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే పరిస్థితి కూడా ఉందని ఆయన తెలిపారు.