కాచిగూడ (హైదరాబాద్)/పాత గుంటూరు: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్త, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి (70) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో ప్రజలకు జ్యోతిషం చెబుతుండగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రామలింగేశ్వర సిద్ధాంతి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. సిద్ధాంతి పార్ధివ దేహాన్ని హిమాయత్‌నగర్‌లోని కుమార్తె ఇంటివద్ద బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట రేస్‌కోర్సు వెనుక ఉన్న హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన బంధుమిత్రులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.
లక్షలాది మందికి మార్గదర్శనం
రామలింగేశ్వర సిద్ధాంతి జ్యోతిషం చెబుతూ, పంచాంగం ద్వారా దాదాపు 4 దశాబ్దాలకు పైగా లక్షలాది మందికి మార్గదర్శనం చేశారు. ఏపీలోని గుంటూరు పండరీపురానికి చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ములుగు నాగలింగయ్యకు వారసుడిగా ఆయన చెప్పిన 95 శాతం అంచనాలు నిజమయ్యాయని చెబుతారు. 14 సంవత్సరాల నుంచి ఆయన అంచనాలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి వచ్చే వారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులయ్యారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించారు. ప్రతి సంవత్సరం పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నారని చానెల్ నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలో ఆయుష్య హోమాలు నిర్వహించారు. టీవీలో వారఫలాలు చెబుతూ ఎంతో మందికి చేరువయ్యారు. ఈయన చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లోని తెలుగువారూ ఎంతగానో విశ్వసిస్తుంటారు. 15 ఏళ్లుగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పంచాంగం అందిస్తున్నారు. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తున్నారు.
మిమిక్రీలో అంతర్జాతీయ ఖ్యాతి
సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఎం.ఆర్.ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం
ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆకస్మిక మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాశి ఫలాల ఆధారంగా ఆయన చెప్పే జ్యోతిషానికి మంచి ఆదరణ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు.
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
Published Sun, Jan 23 2022 8:50 PM | Last Updated on Mon, Jan 24 2022 1:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment