అక్రమ ‘మొబైల్’ టవర్లపై కొరడా
సాక్షి, ముంబై: నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ మొబైల్ టవర్ల ఆగడాలను నియంత్రించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎట్టకేలకు నడుం బిగించింది. ఇన్నాళ్లు చూసీచూడనట్టు వ్యవహరించిన కార్పొరేషన్...స్థానికులు, సామాజిక కార్యకర్తల ఆందోళనలు ఉధృతమవడంతో మొబైల్ టవర్లపై నిఘా ఉంచాలనే ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. ఆమోదం, సలహాలు, సూచనల కోసం పట్టణ అభివృద్ధి విభాగానికి పంపింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నామని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారే నిర్ణయిస్తారని డెవలప్మెంట్ ప్లానింగ్ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుక్నూర్ తెలిపారు. అక్రమ మొబైల్ టవర్లపై కార్పొరేషన్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస భవనాలపైన అమర్చిన మొబైల్ టవర్లపై దృష్టి సారించలేదు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వీరికి స్థానికులు కూడా తోడవడంతో విషయ తీవ్రతను గమనించిన కార్పొరేషన్ ఆగమేఘాలపై గత వారంలో మొబైల్ టవర్ల జాబితాను విడుదల చేసింది. నగరంలో ఉన్న 4,776 మొబైల్ టవర్లలో 1,158 మాత్రమే చట్టపర అనుమతులను కలిగి ఉన్నాయని తెలిపింది. వీటిలో 3,618 అక్రమమైనవని వెల్లడించింది.
దీంతో 75 శాతం మొబైల్ టవర్లు అక్రమంగా ఏర్పాటు చేశారన్న విషయం స్పష్టమవుతోంది. అయితే అక్రమంగా ఏర్పాటుచేసిన టవర్లకు బీఎంసీ అనుమతినివ్వలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఈ టవర్లను నిర్మూలించనున్నారు. దీనివల్ల నగరంలో నెట్వర్క్ కవరేజ్ చాలా తక్కువగా ఉంటుందని టవర్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ మొబైల్ నెట్వర్క్ల నుంచి కాల్ డ్రాప్, నెట్వర్క్ సమస్యలు చాలా ఎదురవుతున్నాయన్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే నెట్వర్క్ సమస్య మరింత జటిలమవుతుందన్నారు. బీఎంసీ నియమాల ప్రకారం...ఆస్పత్రులు, విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. భవనాలపై ఈ టవర్లను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సొసైటీ అనుమతి తీసుకోవాలి.