ఇరాక్‌లో కుర్దులపై రసాయన దాడులు!
ఇరాక్‌లో అమానుషాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా రసాయన దాడులకు సైతం తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్‌లోని కుర్దిష్ సేనలపై ఐఎస్ఐఎస్ గ్రూప్ నిషేధిత రసాయన ఆయుధ దాడులు జరుపుతున్నట్టు దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సల్ఫర్ మస్టర్డ్ దాడులు జరిగాయా? లేదా? అన్నది ధ్రువీకరించాలని అవి అంతర్జాతీయ పర్యవేక్షకులను కోరాయి.
ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల కుర్దిష్ బలగాలకు చెందిన 35 దళాలపై అజ్ఞాత దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలువురు సైనికులకు విపరీతమైన గాయాలయ్యాయి. వీరి గాయాలను పరిశీలిస్తే.. ఇవి నిషేధిత రసాయన వాయువులతో చేసిన దాడులు అయి ఉంటాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయన ఆయుధాలపై నిషేధం కోసం కృషిచేస్తున్న ఓపీసీడబ్ల్యూ సంస్థ బృందం ఇరాక్‌లో పర్యటించి.. ఈ దాడులకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసుకురానుంది.
మరోవైపు వరుస వైమానిక దాడులతో బలహీనపడుతున్న ఐఎస్ఐఎస్ 14 ఏళ్ల బాలురను సైతం ఉగ్రవాద గోదాలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నది. తన అధీనంలో ఉన్న 14 ఏళ్లు, ఆ పైచిలుకు బాలురను సమీకరించేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తర జిల్లాలోని రఖ్కా నగరంలో 14 ఏళ్ల పైచిలుకు అబ్బాయిలు తమ పేర్లను నమోదుచేయించుకోవాలని ఆ గ్రూప్ సర్క్యులర్ జారీ చేసింది.