లుకేమియాకు అద్భుత ఔషధం
న్యూయార్క్: లుకేమియా(బ్లడ్ కేన్సర్) వ్యాధిని నివారించే దిశగా న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోవన్ కెటరింగ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఔషధాన్ని కనుగొన్నారు. ‘ఏజీ-221’ అనే ఈ మందుతో తొలిదశ ఔషధ పరీక్షల్లో అడ్వాన్స్డ్ స్టేజీలో కేన్సర్ ఉన్న రోగులకు కూడా విజయవంతంగా చికిత్స చేశారు. మైలాయిడ్ లుకేమియా ఉన్న రోగుల్లో 15 శాతం మందిలో ‘ఐడీహెచ్2’ అనే జన్యువు మార్పునకు గురైనట్లు వీరు తొలుత గుర్తించారు. ఫలితంగా తెల్లరక్త కణాలు అభివృద్ధి చెందకుండా అపరిణిత కణాలుగా పోగుపడి, చివరకు కేన్సర్ కణాలుగా రూపాంతరం చెందుతున్నాయని కనుగొన్నారు. అయితే ‘ఏజీ-221’ ఔషధం ఉత్పరివర్తనం చెందిన ఐడీహెచ్2 ప్రొటీన్‌ను అడ్డుకుని, తెల్లరక్తకణాలు అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని గుర్తించారు.