ఎల్ఎల్పీలకు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్(ఎల్ఎల్పీ) కంపెనీలకు డిమాండ్ పెరుగుతోందని, చాలా ఎంఎస్ఎంఈ కంపెనీలు ఎల్ఎల్పీలుగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు హైదరాబాద్ రిజిష్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ఎన్.కృష్ణ మూర్తి అన్నారు. మంగళవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ‘ఎల్ఎల్పీ’పై నిర్వహించిన సదస్సుకు కృష్ణ మూర్తి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 95,000 కంపెనీలు నమోదై ఉన్నాయని, అందులో ఎల్ఎల్పీల సంఖ్య 898గా ఉన్నాయన్నారు.
దేశం మొత్తం మీద 12 లక్షల కంపెనీలు ఉంటే అందులో ఎల్ఎల్పీల సంఖ్య 25,691గా ఉంది. ప్రైవేటు కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు ఎల్ఎల్పీలుగా మారడానికి ఆసక్తి కనపరుస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం పరిమిత లయబిలిటీ, కంప్లయెన్స్ తక్కువగా ఉండటమే కారణం అన్నారు. లండన్ వంటి నగరంలో 30 లక్షలకు పైగా కంపెనీలు నమోదై ఉండగా అందులో అత్యధిక కంపెనీలు ఎల్ఎల్పీ, సింగిల్ మేన్ కంపెనీలుగా ఉన్నాయన్నారు.
ఇప్పట్లో ఆర్ఓసీ విభజన వుండదు
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కొంతకాలం ఉమ్మడిగానే కొనసాగుతుందని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్వోసీ ఏర్పాటు చేసే మౌలిక వసతులు లేవని, దీంతో కొంత కాలం ఇదే విధంగా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్, నాగోల్ సమీపంలో నిర్మిస్తున్న ఆర్వోసీ సొంత భవన నిర్మాణం తుది దశలో ఉందని, ఈ సంవత్సరాంతానికల్లా కొత్త భవనంలోకి మారే అవకాశం ఉందన్నారు.