ఆధార్ క్షోభ...
* ఉపకార వేతనాలకోసం చనిపోయిన వారిని ఎలా తీసుకురావాలి?
* ఆవేదన వ్యక్తంచేస్తున్న విద్యార్థులు
* విధిగా తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు
* కావాలంటున్న ప్రభుత్వం
నక్కపల్లి : ప్రభుత్వం ఇచ్చే అరకొర ఉపకార వేతనాల కోసం చనిపోయిన తమ తల్లిదండ్రులను ఎక్కడ నుంచి తీసుకురావాలి, వారికి ఎక్కడ ఆధార్‌కార్డులు తీయించాలంటూ పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్‌లింక్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ నిబంధనల వల్ల తమ క్షోభను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
ఉపకార వేతనాలకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రొఫార్మాలో తల్లి,తండ్రి,దరఖాస్తుదారుడి ఆధార్ నంబర్‌ను విధిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు ప్రత్యేంగా ఆప్షన్ ఇచ్చింది. ముగ్గురి నంబర్లు ఎంటర్‌చేస్తేనే ఆన్లైన్ ఉపకార వేతనాలకోసం దరఖాస్తు అప్లోడ్ అవుతోంది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి ఆధార్నంబర్లేకపోయినా దరఖాస్తు తిరస్కరించబడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సుమారు 40 మంది విద్యార్థులకు ఈ పరిస్థితి ఎదురవడంతో అంతా పాలుపోక బుధవారం మండల పరిషత్కార్యాలయానికి వచ్చి ఈవోఆర్డి, విలేకరుల వద్ద తమగోడు చెప్పుకున్నారు. విద్యార్థుల్లో చాలామందికి తల్లి దండ్రులు లేరు. కొందరికి తల్లిఉంటే, తండ్రిలేడు.
బంధువుల సంరక్షణలోపెరుగుతూ చ దువుకుంటున్నారు. తల్లిదండ్రులు విడిపోవడంతో ఎవరో ఒకరి దగ్గర ఉంటూ మరికొందరు చదువుతున్నారు.
వీరికి ప్రభుత్వం ఏడాదికి రూ.3వేలు ఉపకారవేతనం ఇస్తోంది. ఇప్పటివరకు ఆధార్ లింక్లేదు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సయయంలో విద్యార్థితోపాటు తల్లిదండ్రుల ఆధార్‌నంబర్లు కూడా నమోదు చేయాలని పేర్కొంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఎవరు బతికుంటే వారి నంబర్ నమోదుచేస్తుంటే దరఖాస్తు అప్లోడ్ కావడం లేదు. తిరస్కరించబడుతోంది. ఉపకారవేతనాల కోసం చనిపోయినవారిని ఎక్కడ నుంచి తీసుకురావాలని విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి కొందరి తల్లిదండ్రులకు ఆధార్ కార్డులు లేవు, గతంలో తీసుకున్నవాటికి ఇంకా కార్డులు జారీ కాలేదు.
నెలాఖరుతో ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకునే గడువు తీరిపోతోంది.ఈ నేపథ్యంలో దిక్కుతోచక ఇబ్బంది పడుతున్నారు. వీరి బాధలు తెలుసుకున్న స్థానిక నాయకులు కోసూరు శ్రీను,తదితరులు విద్యార్థులను వెంటబెట్టుకుని మండలకార్యాలయానికి వచ్చి ఈవోఆర్డి కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.
తక్షణంప్రభుత్వం స్పందించి దరఖాస్తులో అప్షన్ మార్చి అందుబాటులో ఉన్నవారి ఆధార్ నంబర్ వే స్తే ఉపకారవేతనం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కె. బాలగంగ,భవానీ,వరలక్ష్మి,రాణి,దుర్గాప్రసాద్,వీరబాబు కోరుతున్నారు.సాంఘిక సంక్షేమ శాఖ డీడీ దృష్టికి తీసుకువెళ్లి వీరి సమస్య పరిష్కారానికి కృసిచేస్తానని ఈవోఆర్డి కుమార్ హామీ ఇచ్చారు.