చిన్నమ్మా శరణు..
► అన్నాడీఎంకే నేత నాంజిల్ సంపత్ యూటర్న్
►శశికళను కలిసి మద్దతు
►పాత బాధ్యతల్లోనే మళ్లీ నాంజిల్ నియామకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో జయలలిత స్థానంలో మరెవ్వరినీ తాను జీర్ణించుకోలేనని అంటూ పరోక్షంగా శశికళ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నాంజిల్ సంపత్ అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు. పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మా అంటూ శరణు కోరారు. అన్నాడీఎంకే అవసరాలకు తగినట్లుగా పనిచేస్తానని విజ్ఞప్తి చేశారు. ఎండీఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న నాంజిల్ సంపత్ ఆ పార్టీ ప్రధాన వైగోతో అభిప్రాయబేధాలతో పార్టీ నుంచి వైదొలిగారు. 2012 డిసెంబర్ 4వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ప్రచార ఉప కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతోపాటు ఒక ఇన్నోవా కారును సైతం జయలలిత ఆయనకు బహూకరించారు. ఈ కారులోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇదిలా ఉండగా, 2016 డిసెంబర్లో భారీ వర్షాలు, చెన్నైని వరదనీరు ముంచెత్తినప్పుడు తిరువన్మియూరులో అన్నాడీఎంకే బహిరంగ సభను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రజలు కష్టపడుతున్నప్పుడు ఇంతటి ఘనమైన బహిరంగ సభలు అవసరమా అని ఒక టీవీ చానల్ ఆయన్ను ప్రశ్నించగా ‘పక్కింట్లో చావుకు మనింట్లో పెళ్లిని నిలిపివేయలేం కదా’ అంటూ నాంజిల్ సంపత్ చేసిన వ్యాఖ్యానాలు వివాదాస్పదమయ్యాయి. జయలలిత సైతం ఆగ్రహించి ప్రచార బాధ్యతల నుంచి ఆయన్ను తొలగించారు. పార్టీ సమావేశాల్లో సైతం ఆయన హాజరుకాకుండా చేశారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణించడంతో ప్రచార ఉప కార్యదర్శి బాధ్యతల కోసం ఆమె తనకు బహూకరించిన ఇన్నోవా కారును పార్టీ ప్రధాన కార్యాలయంలో గత వారం అప్పగించేశారు. జయలలిత ఉన్న స్థానంలో మరెవ్వరినీ జీర్ణించుకోలేను, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మూడు రోజుల క్రితం ప్రకటించారు. సాహితీవేత్తగా తన జీవనాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదు, డీఎంకేలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ముచ్చటగా మూడురోజులు కూడా పూర్తికాక ముందే ఆయన మనస్సు మార్చుకున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు పోయెస్‌గార్డెన్ వెళ్లి శశికళను కలుసుకున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగుతానని ఆమెకు మాటిచ్చారు. పార్టీకి సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఆమెకు తెలిపారు. పార్టీ కార్యాలయంలో అప్పగించిన ఇన్నోవా కారును సైతం తిరిగి తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మను కలుసుకోవడం తన మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూర్చిందని చెప్పారు. పార్టీ కోసం, ప్రభుత్వ ప«థకాలను ప్రచారం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానని తెలిపారు. చిన్నమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రసంగాలు చేస్తానని అన్నారు. అప్పగించిన కారును తిరిగి స్వీకరిస్తారా అని మీడియా ప్రశ్నించగా, చిన్నమ్మ సైతం కారు గురించి ప్రస్తావించారని తెలిపారు. అమ్మ మీకు ఇచ్చిన కారును ఎందుకు అప్పగించేశారు, నేనే తిరిగి మీ ఇంటికి పంపాలని అనుకుంటున్నానని ఆమె అన్నట్లు తెలిపారు.
మరి ఇంతకాలం పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించగా, అమ్మ మరణంతో ఒంటరైన భావన కలగడంతో ప్రజాజీవితం ఇక చాలు అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే చిన్నమ్మ తనకు కబురు పెట్టడంతో మళ్లీ ఉత్సాహంగా ముందుకు వచ్చానని అన్నారు. గతంలోని ప్రచార ఉప కార్యదర్శి పదవినే నిర్వíßస్తూ పార్టీ, ప్రభుత్వం కోసం పాటుపడాలని ఆమె సూచించినట్లు నాంజిల్ సంపత్ వివరించారు.
కొనసాగుతున్న శశికళ సమావేశాలు: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈనెల 4వ తేదీన ప్రారంభమైన జిల్లాల వారీగా శశికళ సమావేశాలు శనివారం కూడా కొనసాగాయి. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న శశికళకు సీఎం పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. తిరువారూరు, పుదుక్కోట్టై, మదురై, కడలూరు, విళుపురం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల నుంచి వచ్చిన నేతలతో శశికళ సమావేశం నిర్వహించారు.