‘అటవీ’ రీ-ఆర్గనైజేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీశాఖలో రీ-ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పునర్విభజన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అంతరించి పోతున్న అడవులు, వన్యప్రాణులకు సంరక్షణ కరువైన నేపథ్యంలో అటవీశాఖను పటిష్టపరచాలని 2009లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్ సింగ్ సుమారుగా ఏడాదిన్నరపాటు అధ్యయనం జరిపిన తర్వాత 2010 డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్, డివిజన్, రేంజ్ కార్యాలయాల పెంపుతోపాటు అధికారులు, సిబ్బంది అవసరాలపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి పూర్తి వివరాలను సమర్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్లు, అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన మార్పులు, చేర్పులను నివేదికలో సూచించారు. ఈ మేరకు ఆ నివేదికపై ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి నిర్మల్‌లో ప్రకటించారు. ఈ నెల 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
ఎట్టకేలకు మోక్షం
అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్‌సింగ్ ఆరు మాసాలపాటు అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో సమూల మార్పులు చేయాలని సూచించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పెంపకం, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఆయన నివేదికలో మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్ఎస్ కేడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డీఎఫ్‌వోలుగా నియమించాలని సూచించారు. అటవీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గనున్నది. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో 1,473 స్క్వేర్ కిలోమీటర్లు కాగా, 750 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గనుంది.
అదే విధంగా ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 15 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఒక్కటే సర్కిల్ ఉండగా, ఆదిలాబాద్, మంచిర్యాలలు రెండు జిల్లాలుగా విభజించనున్నారు. ఆరు డివిజ్లనను 11కు పెంచనుండగా, 26గా రేంజ్‌లు 41కి పెరగనున్నాయి. అటవీశాఖ గణాంకాల ప్రకారం 7,19,549 హెక్టార్ల విస్తరించి ఉన్న అడవులు... ఒక్కో డివిజన్లో ప్రస్తుతం 1,19,925 హెక్టార్లు ఉంది. మరో ఐదు డివిజన్లు పెరిగితే 11 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 65,414 హెక్టార్లు వస్తుంది. అలాగే 125గా ఉన్న సెక్షన్లు 170కి, 313 బీట్లు, 450కి పెరగనున్నాయి.
అంతా సిద్ధం
- తిమ్మారెడ్డి, చీఫ్ కన్జర్వేటర్, ఆదిలాబాద్
అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్‌కు అంతా సిద్ధంగా ఉంది. రీ-ఆర్గనైజేషన్ కోసం ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదనలు తీసుకుంది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం పునర్విభజన జరిగితే ఫలితాలు బాగా ఉంటాయి. అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. అధికారికంగా ఉత్తర్వులు అందగానే జిల్లాలో రీ ఆర్గనైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది.