తెగిపడిన రైల్వే సిగ్నల్స్ తీగలు
నిడదవోలు : తాడేపల్లిగూడెం మండలం నవాబ్‌పాలెం వద్ద రైల్వే సిగ్నల్ తీగలు తెగిపడటంతో శనివారం ప్రధాన రైళ్లు పది నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. నవాబ్‌పాలెం వద్ద ఎర్ర కాలువ ఆధునికీకరణ పనులు చేస్తుండగా రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన టెలిఫోన్ తీగలకు పొక్లెయిన్ తగలడంతో తెగిపడ్డాయి. దీంతో సిగ్నల్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు డ్రైవర్లకు ఎల్సీసీ ఇచ్చి మ్యానువల్ పద్ధతితో రైళ్ల రాకపోకలకు క్లియరెన్స ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైల్వే సిగ్నల్ వ్యవస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని లైన్లను పునరుద్ధరించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లను నిడదవోలు స్టేషన్లో నిలిపివేసి డ్రైవర్లకు లైన్ క్లియర్ సర్టిఫికెట్‌ను (ఎల్సీసీ)ని అందచేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లకు నవాబ్‌పాలెం స్టేషన్లో ఎల్‌సీసీలను ఇచ్చి రాకపోకలు సాగిం చారు. దీంతో రత్నాచల్, ప్రశాంతి, బొకారో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పాసింజర్ రైళ్లు పది నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.