రేప్‌కు గురైన మైనర్ బాలిక పరిస్థితి విషమం
ఒడిశా రాష్ట్రంలోని నయాగర్ జిల్లాలో అత్యాచారానికి గురైన గిరిజన మైనర్ బాలిక పరిస్థితి విషమంగా ఉందని కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బాలిక పాక్షికంగా సృహలో ఉంటుందని తెలిపారు. మైనర్ బాలిక మెడపైన బలమైన గాయానికి శస్త్ర చికిత్స నిర్వహించామని, అయినా ఆ బాలిక మట్లాడలేకపోతుందని చెప్పారు.
ఆగస్టు 20న కందపడ పోలీస్ స్టేషన్ పరిధిలో కందమిరిగి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. రక్తపు ముడుగులో విగత జీవిగా ఉన్న ఆ మైనర్ బాలికను కుటుంబ సభ్యులు చూసి భువనేశ్వర్‌లోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆమె పరిస్థితిలో ఎంతకు మార్పు రాకపోవడంతో ఆమెను కటక్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.