నేలరాలిన సాహితీ ‘సుమం’
చౌడేపల్లె(చిత్తూరు): ప్రముఖ కవి, సాహితీవేత్త, విజయవాణి ప్రింటర్స్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని కృష్ణమూర్తి (67) మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో కృష్ణమూర్తి జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న నాయని తన 23 ఏళ్ల వయసులో యామినీ కుంతలాలు అనే నవల రాశారు.
ఈ నవలకు 1974 ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. అనంతరం కొంతకాలం బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకులుగా పనిచేశారు. పిల్లల పత్రిక స్నేహబాలను నడిపించారు. సోదరులతో కలిసి మాబడి, పాఠశాల మాసపత్రికలను నిర్వహించారు. తద్వారా గ్రామీణప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడ్డారు. సాక్షరతా సమితి అకడమిక్ కమిటీ చైర్మన్గా పదిహేను సంవత్సరాలు పనిచేశారు. నిరంతర విద్యాకేంద్రాలకు వెలుగుబాట వారపత్రికను అందించారు. నాయని మరణవార్త తెలిసిన వెంటనే స్థానికులు, రచయితలు, కవులు, పలువురు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణమూర్తి పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం 12:30కి చౌడేపల్లిలోని విజయవాణి స్కూల్ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సీఎం సంతాపం
నాయని కృష్ణమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మా బడి, పాఠశాల తదితర మాస పత్రికలు నిర్వహించి విద్యార్థులకు కృష్ణమూర్తి మార్గదర్శిగా నిలిచారని ఆయన కొనియాడారు.