సామాజిక న్యాయంలో మరో అడుగు ముందుకు
సాక్షి, అమరావతి: ‘దేశంలో సామాజిక న్యాయాన్ని మొట్టమొదటిసారిగా చేతల్లో చూపించిన రాష్ట్ర ప్రభుత్వం మనది. సామాజిక న్యాయంలో భాగంగానే మరో అడుగు ముందుకేస్తూ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సంపూర్ణ మద్దతు తెలిపాం..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పార్టీ నిర్ణయాన్ని సహృదయంతో బలపరచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎన్డీయే ఎంపిక చేయడంతో.. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో మంగళవారం విజయవాడ వచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, వైఎస్సార్సీపీపీ నేత వి.విజయసాయిరెడ్డితో కలిసి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు.. సీఎం వైఎస్ జగన్ దంపతులు ఎదురొచ్చి స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెకు సీఎం వైఎస్ జగన్ తేనీటి విందు ఇచ్చారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును తన నివాసంలోకి సాదరంగా తోడ్కొని వెళ్తున్న సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి.
► రాష్ట్రంలో 175 స్థానాలకుగాను 151 సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీ స్థానాలకుగాను 22 చోట్ల గెలిచిన ఎంపీలు, పార్టీ తరఫున ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యులు.. మనమంతా కలిసి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.
► మొట్టమొదటిగా గిరిజన మహిళ ఈ దేశ రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు.
► మన పార్టీ మొదటి రోజు నుంచి ఏ రకంగా సామాజిక న్యాయం వైపున ఉంటోందో అందరికీ తెలుసు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మనది. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఇవాళ ద్రౌపది ముర్మును ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉన్నాయి. పార్టీ నిర్ణయాన్ని సహృదయంతో బలపరచాలని కోరుతున్నాను.
► 18న జరిగే ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ మిస్ కాకుండా ఓటు వేయాలి. అందరూ వచ్చి ఓటువేసేలా విప్‌లంతా ఈ బాధ్యత తీసుకోవాలి. 18న ఉదయం అసెంబ్లీలోని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో మాక్ పోలింగ్‌లో పాల్గొని ఆతర్వాత ఓటింగ్‌కు వెళ్లాలి. దీనివల్ల ఓటింగ్‌లో తప్పులు జరక్కుండా నివారించగలుగుతాం. పొరపాటు జరిగితే ఓటు చెల్లకుండాపోతుంది. వేసిన ప్రతి ఓటు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని ఓటు వేస్తే అన్నీ చెల్లుబాటు అవుతాయి.
► ఎంపీల వైపు నుంచి సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల వైపు నుంచి విప్‌లు, మంత్రులు అందరూ వచ్చేలా చూసుకోవాలి. మంత్రులందరూ వారి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
► ఎవ్వరు మిస్ అయినా కూడా ఒక ఓటు మనమంతట మనమే తగ్గించిన వారం అవుతాం. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు మనవైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ముర్ముకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం
ప్రజాప్రతినిధులను ముర్ముకు పరిచయం చేసిన జగన్
ప్రసంగం పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పరిచయం చేశారు. తొలుత స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వరుసగా ఆమెకు పరిచయం చేశారు.
సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
చిత్రంలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు
అభ్యర్థిని నిర్ణయించక ముందే మోదీ, అమిత్‌షా వైఎస్సార్సీపీతో మాట్లాడారు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
అభ్యర్థి నిర్ణయించక ముందే ఎన్డీయే మిత్రపక్ష పార్టీలతో పాటు బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ పార్టీలతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారని ఆ తరువాతే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును ప్రకటించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో కలిసి ఏపీలో పర్యటిస్తున్న ఆయన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ సమయంలో మీడియాతో మాట్లాడారు.
పెద్ద మనస్సుతో ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి సంపూర్ణంగా మద్దతిచ్చినందుకు ఎన్డీఏ తరఫున, ప్రధాని మోదీ తరఫున సీఎం జగన్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. వెనుకబాటుతనానికి గురైన గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడం హర్షణీయమన్నారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా రాష్ట్రపతిని అధిరోహించే స్థితి రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇందులో భాగస్వాములైన వైఎస్సార్సీపీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.