త్వరలో కొత్త ఇంటికి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతునారు. ఉత్తరఢిల్లీలోని సివిల్‌లైన్స్‌లో ఆయనకు ఒక ఇల్లు దొరకడంతో తిలక్లైన్స్లోని అధికారిక నివాసాన్ని వచ్చే నెల మొదటివారానికల్లా ఖాళీ చేస్తానని ప్రకటించారు. ‘సివిల్‌లైన్స్ నరేన్ జైన్ నాకు ఒక ఇల్లు చూపించారు. త్వరలోనే అక్కడికి మారబోతున్నాను. ఇల్లు చాలా బాగుంది. ననరేన్కు కృతజ్ఞతలు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రామ్‌జైన్ కుమారుడు అయిన నరేన్ ఢిల్లీలో స్థిరాస్తులను అద్దెకు ఇస్తుంటారు. దీని గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా జవాబు ఇవ్వడానికి మొదట తిరస్కరించారు. తదనంతరం మాత్రం ఇల్లును అద్దెకు ఇస్తున్నట్టు అంగీకరించారు. ‘అవును. సివిల్‌లైన్స్‌లోని ఆ ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇవ్వాలని మా దళారీకి నేను సూచించాను.
అయితే దానిని కేజ్రీవాల్‌కు ఇస్తున్న సంగతి నాకు మొదట్లో తెలియదు’ అని నరేన్ వివరించారు. ఇక ఈ ఇంట్లో నాలుగు పడక గదులు, బాత్రూమ్లు, వంటిల్లు, భోజనాల గది, హాల్ ఉన్నాయి. ముందూ వెనుక చిన్నపాటి ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రముఖ రచయిత సల్మాన్ రష్టీ తండ్రికి చెందిన ఈ ఇంటిని ఆయన 1960లో అమ్మేశారు. దీనిని 2005లోనే నరేన్ కొనుగోలు చేసినా, అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. దీని నెల అద్దె రూపాయి మాత్రమే ఉండొచ్చని చెబుతున్నారు. నరేన్ మాత్రం అలాంటిది ఏం లేదంటున్నారు. ‘అద్దె గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందరం కూర్చొని మాట్లాడక నిర్ణయిస్తాం. కొంత రాయితీ కూడా ఇస్తాం. వచ్చే నెలవరకల్లా ఒప్పందం ప్రక్రియ పూర్తవుతుంది. నెలకు రూ. 50-60 వేల వరకు అద్దె ఉంటుంది’ అని ఆయన వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన 49 రోజులకే కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి వైదొలగడం తెలిసిందే. తన కూతురికి పరీక్షలు ఉన్నందున, అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు జూలై వరకు గడువు ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరారు.దీనిపై విపక్షాలు కేజ్రీవాల్‌ను విమర్శించడం తెలిసిందే. నరేన్ జైన్ కూడా సివిల్లైన్స్లోనే ఉండడం వల్ల పనివాళ్లు ఇదే ఇంట్లో ఉండేవారు. అయితే జైన్ ఇటీవలే వారిని ఖాళీ చేయించారు. చాలాకాలంగా ఎవరూ నివాసముండకపోవడం వల్ల ఈ ఇల్లు పాతబడిపోయింది. మరమ్మతులు ముగిసిన తరువాత కేజ్రీవాల్ ఈ భవనంలోకి మారతారు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను కేజ్రీవాల్ చెల్లిస్తారని, తరువాత ఇంటి అద్దె నుంచి కత్తిరించుకుంటారని చెబుతున్నారు.