లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్ గా మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో 27,362 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 8439 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. ఎగిసి 8400 స్థాయిని అధిగమించింది. ప్రధానంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, హిందాల్కో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇంకా ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ లాభపడగా... బాష్, భారతీ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా, బీపీసీఎల్ నష్టాలతో ఉన్నాయి.
ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్లకు టాక్స్ ప్రయోజనాల అంచనాల నేపథ్యంలో నెల రోజుల తరువాత దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్లు చేపట్టడం గమనార్హమని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ 20 తరువాత ఈ తరహా కొనుగోళ్లు ఇదే మొదటి సారని విశ్లేషించారు. మంగళవారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ. 142 కోట్లకుపైగా, దేశీయ మదుపర్లు రూ.607కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం విశేషం.
అటు డాలర్ బలహీనంగా ఉండడటంతో దేశీయ కరెన్సీ బలంగా ఉంది. 18 పైసలు లాభపడి రూ.67.93 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 215 భారీ లాభంతో రూ.28,744 వద్ద ఉంది.